కేసీఆర్‌ అహంకారాన్ని దించడం బీజేపీతోనే సాధ్యం

– బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ధన్యవాదాలు : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేసీఆర్‌ అహంకారాన్ని దించడం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. తనకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, అధ్యక్షులు జేపీ నడ్డా, తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌, బండి సంజరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల అంతరంగం, కేసీఆర్‌ ఎత్తుగడలు, లోపాలు తెలిసిన వ్యక్తిననీ, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు లేవని చెప్పారు. తాను నేతలందర్నీ కలుపుకుని ముందుకు సాగుతామని చెప్పారు.
కిషన్‌రెడ్డి అందరికీ అమోదయోగ్యమైన నేత :ఎంపీ అర్వింద్‌
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అందరికీ అమోదయోగ్యమైన నేత అని ఎంపీ డి.అర్వింద్‌ అన్నారు. బండి అగ్రెసివ్‌ నాయకుడనీ, ఆయన నేతృత్వంలో పార్టీ వేగంగా ముందుకెళ్లిందని చెప్పారు. తమ మధ్య విభేదాలు లేవనీ, కలిసి పనిచేస్తామని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూప్‌ తగాదాలు లేకుండా సమన్వయం చేసుకుంటామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన అనేది ప్రచారం మాత్రమే అని కొట్టిపడేశారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ నేతలను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. తాను కూడా ఢిల్లీలో అనేక మంది కాంగ్రెస్‌ నేతలను కలుస్తుంటాననని తెలిపారు. అంతమాత్రనా పార్టీ మారిపోతున్నట్టా? అని ప్రశ్నించారు. పార్టీకి అధ్యక్షుడిగా విస్తృత సేవలందించిన బండి సంజరుకు ధన్యవాదాలు తెలిపారు. కవిత లిక్కర్‌ కేసు గురించి మీడియా అడగ్గా…కవిత అంటే ఎందుకంత కోపం? అని ఎదురు ప్రశ్నించారు.