కార్మికోద్యమ నేత, సీఐటీయూ ఉద్యమాల మార్గదర్శకుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కామ్రేడ్ పి.బాలకష్ణయ్య గౌడ్ 17వ వర్థంతి నేడు. కష్టజీవుల కోసం, కార్మికుల శ్రేయస్సుకు ఆయన చేసిన కృషి ప్రజల హృదయాల్లో నేటికీ చెదరని ముద్రే.1952లో ఎత్తిన జెండా ఆయన 2007లో కనుమూసే వరకు వీడలేదంటే పేదలన్నా, పోరాటాలన్నా ఎంతటి మమకారమో అర్థం చేసుకోవచ్చు. నాగర్‌కర్నూల్‌లో గుమస్తాగా పనిచేసిన ఆయనకు అక్కడి కమ్యూనిస్టు నాయకులతో ఏర్పడిన పరిచయం పార్టీ సభ్యునిగా మార్చింది. 1962లో భారత్ -చైనా యుద్ధం సందర్భంగా పార్టీ పొరుగు దేశాలలో శాంతియుతంగా సమస్య పరిష్కరించు కోవాలనే లైన్‌ను తీసుకోవడంతో అప్పటి పాలకవర్గం కార్యకర్తలందరీని అరెస్టుచేసి రాజమండ్రి, చంచల్ గూడ జైలులో నిర్బంధించింది. 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన వారిలో బాలకిష్ణయ్య ఒకరు. తర్వాత కాలంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు మోటూరి హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ, లావు బాల గంగాధర్‌రావు వంటి ముఖ్య నేతల్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యమాల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ పునర్నిర్మాణం తర్వాత జిల్లా కమిటీ సభ్యుడిగా, కార్యదర్శివర్గ సభ్యులుగా కడవరకూ పనిచేశాడు. ఈ కాలంలో ప్రభుత్వం నుంచి ఎన్నో నిర్బంధాలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. ట్రేడ్ యూనియన్ రంగం రాష్ట్ర నాయకులు లక్ష్మీదాస్‌తో కలిసి బాలకిష్టయ్య గౌడ్ పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్లలో పనిచేసే కార్మికులతో సంఘాల్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆనాడు కార్మికులు చెమడోడ్చడమే తప్ప హక్కులు, పని గంటలు తెలియని రోజుల్లో వారిని ఐక్యం చేసి పోరాటాల్లో పాల్గొనేలా చేశాడు. జిల్లాలో సీఐటీయూ అభివృద్ధికి వర్క్ ఛార్జెట్ కార్మిక ఉద్యమం ఎంతగానో తోడ్పడింది. భవననిర్మాణం, హమాలీలు, అంగన్వాడీ, మున్సిపల్ తదితర రంగాల్లో బలమైన ఉద్యమాలు నిర్మించి వారి సమస్యలపై పోరు ఉద్యమం నడిపాడు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, పార్టీ సొంత భవనాల నిర్మాణానికి అవిరాళమైన కృషి చేశాడు. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఐటీయూ 8వ మహాసభలను మహబూబ్‌నగర్‌లో ఘనంగా నిర్వహిం చడంలో బాల కిష్టయ్యది ప్రధాన పాత్ర. అప్పటి రాష్ట్ర నాయకులు పర్సా సత్యనారాయణ మహాసభల నిర్వహణ చూసి జిల్లా ఉద్యమం ” పిట్ట కొంచెం..కూత గణం” అన్నట్లు ఉందని అభినందించారు. 2005లో జిల్లా సమగ్రాభివద్ధి పాదయాత్ర జరగ్గా ముగింపురోజు బహిరంగసభకు కామ్రేడ్ బీవీ. రాఘవులు హాజర య్యారు. జిల్లా ఉద్యమాభివృద్ధికి ఈ సభ ఒక పెద్ద ముందడుగని వ్యాఖ్యానించారు. వారు చెప్పినట్టు గానే బాలకిష్టయ్య జిల్లా ఉద్యమాల్లో నిర్మాణాత్మక పాత్రను పోషించాడు. ఈ సందర్భంగా యన ఆశయ సాధనలో ముందుకు సాగడమే మనమిచ్చే నిజమైన నివాళి.
– కిల్లెగోపాల్