– పీక్ స్టేజ్‌లో ప్రచారం
– ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
– బస్తీల్లో ఊపందుకున్న ప్రచార హౌరు
– ఈ వారంలో నగరానికి రాహుల్, ప్రియాంక, మోడీ రాక
నవతెలంగాణ-సిటీబ్యూరో
లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా నాలుగు రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండ్రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సభలు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకులు రోజులో రెండు మూడు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ముఖ్యంగా తటస్థ ఓటర్లు, మహిళాసంఘాలు, కుల, కాలనీ సంఘాలతో పాటు ఇతర బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. గ్రేటర్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రసంగాల్లో ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పుట్టిన్నారు. మరోపక్క గడువులోగా అధిష్టాన పెద్దలతో బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈ మిగిలిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకునే కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.
ఎండల ఎఫెక్ట్.. రాత్రి వేళల్లోనూ ప్రచారం!
ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వేడి వాతావరణంతో సభలు, ప్రచార కార్యక్రమాలకు ఇబ్బందిగా మారిందని నగరానికి చెందిన పలువురు ముఖ్య నేతలు చెబుతున్నారు. సభలు, సమావేశాలకు జనసమీకరణ, నిర్వహణ కష్టతరంగానే ఉందని అంటున్నారు. ఉదయం వేళల్లో బస్తీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, పార్కులు, జనసంచారం ఉండేచోట నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. సాయంత్రం కార్నర్ మీటింగ్‌లు, రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. చీకటి పడ్డాక ప్రచార సమయం ముగిసే వరకూ బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తున్నారు. గడువు దగ్గరపడే కొద్దీ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే ఆ రోజు ప్రణాళిక మేరకు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఆయా డివిజన్ల వారీగా వెళుతూ.. ప్రజలతో మమేకమవుతూ.. బిజీబిజీగా గడుపుతున్నారు. బస్తీలు, కాలనీల్లో స్థానిక సమస్యలను.. అక్కడ జరగాల్సిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు.
నగరానికి అగ్రనేతల రాక..
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడటంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు డజను మందికిపైగా రాజధానికి రానున్నారు. దాంతో ప్రచారం పీక్ స్టేజీకి చేరనుంది. పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రేటర్‌లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో మరిన్ని రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లు జరపనున్నారు. ఈనెల 9న సరూర్‌నగర్‌లో జరిగే జన జాతర సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండగా.. 10న ప్రియాంకా గాంధీ తాండూరు జనజాతర సభలో.. అనంతరం పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొననున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర సాగిస్తున్నారు. దాదాపు 14 రోజులుగా చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. యాత్ర సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలవి మోసపూరిత హామీలంటూ ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.
బస్సుయాత్ర ముగిసిన వెంటనే.. 11వ తేదీన నాలుగు పార్లమెంట్ స్థానాలను కవర్ చేసేలా.. నగరంలో భారీ సభ నిర్వహించడంపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈలోగా కేటీఆర్‌తో రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున ఇప్పటికే కేంద్ర హౌం శాఖమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్డుషోలు నిర్వహించారు. ప్రధాని మోడీ 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో సభకు రానున్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు బుధవారం నుంచి శనివారం వరకు ఇక్కడే ఉండి ప్రచారంలో పాల్గొననున్నారు.
అసంతృప్తులకు గాలం..
ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే పార్టీలు తమ బలాన్ని పెంచుకొనేందుకు ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నా యి. అయితే కొత్తగా వస్తున్నవారికి.. పాత నాయకులకు సమన్వయం చేయటం.. ప్రచారంలో భాగస్వాములను చేయడం లేదని తెలుస్తోంది. మూడు పార్టీల అభ్యర్థులు బలమైన సామాజిక తరగతుల్లో పెద్ద మనుషులను కలుస్తూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.