2024 ఎన్నికల్లో ‘ఇండియా’ గెలిస్తేనే

– దేశానికి రక్షణ : స్టాలిన్‌
చెన్నై : 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ గెలిస్తేనే దేశాన్ని రక్షించుకోగలమని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ తెలిపారు. నెవైల్లీలో తమ పార్టీ కార్యకర్త, శాసనసభ్యులు రాజేంద్రన్‌కు సంబంధించిన ఒక కుటుంబ కార్యక్రమం సందర్భంగా స్టాలిన్‌ వర్చువల్‌గా ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 పార్లమెంట్‌ స్థానాలను డీఎంకే పార్టీ గెలుచుకోవాల్సిన ఆవశ్యకతను స్టాలిన్‌ తన ప్రసంగంలో వివరించారు. ‘మనం ఆ స్థాయిలో ఘన విజయం సాధిస్తేనే.. తదుపరి అధికారంలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వంలో మనం కీలక పాత్ర పోషించగలం’ అని స్టాలిన్‌ తెలిపారు. మొత్తం 40 స్థానాల్లోనూ డీఎంకే విజయం సాధించాలని పార్టీ కార్యకర్తలకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు.