దీప్తి పీసపాటి… సివిల్ ఇంజనీరింగ్ చేసి కనస్ట్రక్షన్ రంగంలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. పెండ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత పిల్లలే ఆమె ప్రపంచమయ్యారు. పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రసవం తర్వాత పెరిగిన బరువును తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో ఉండగా మరెందరో తల్లులు గుర్తొచ్చారు. ఫిట్‌నెస్ పట్ల అవగాహన లేక ఎంతో మంది మహిళలు అధిక బరువుతో బాధపడడం గమనించారు. దానికి పరిష్కారంగానే నేవా ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
నేను పెట్టింది, పెరిగింది మొత్తం హైదరాబాద్. అమ్మ జ్యోతి వలబోజు, రచయిత, పబ్లిషర్. నాన్న గోవర్ధన్ సివిల్ ఇంజనీర్‌గా చేసి రిటైర్ అయ్యారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్లో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. 8వ తరగతి నుండి పది వరకు నిజాంపేట్ విజ్ఞాన్ విద్యాలరులో పూర్తి చేశాను, నారాయణగూడ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదివాను. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేసి, కనస్ట్రక్షన్స్‌లో మాస్టర్స్ చేశాను. చదువు పూర్తి చేసిన తర్వాత ఫలక్‌నూమా ప్యాలెస్‌కు ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా చేశారు. తర్వాత తాజ్ కృష్ణలో కూడా చేశాను. అలాగే బేగంపేట్ తాజ్‌కు ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా చేశాను. పెండ్లి తర్వాత బెంగుళూరు వెళ్ళాను. అక్కడ కూడా కొంత కాలం పని చేసి పాప పుట్టడంతో తనని చూసుకోవడం కోసం కనస్ట్రషన్స్ వర్క్ వదిలేశారు. తర్వాత బాబు పుట్టాడు. ప్రస్తుతం మేము ఆస్ట్రేలియాలోని మెల్బోన్‌లో ఉంటున్నాం.
టార్గెట్ పెట్టుకోలేదు…
మొదటి నుండి నాకు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత బరువు పెరిగాను. ఇది ప్రతి మహిళ జీవితంలో సహజంగా జరిగేదే. పాప పుట్టినప్పుడు 30 కేజీలు పెరిగాను. బాబు పుట్టినప్పుడు 25 కేజీల వరకు పెరిగాను. పోస్ట్ ప్రెగెన్సీ తర్వాత బరువు తగ్గాలనే ఆలోచన వచ్చింది. అయితే ఆరు నెలల్లో తగ్గాలి, ఏడాదిలో తగ్గాలని టార్గెట్ ఏమీ పెట్టుకోలేదు. బరువు తగ్గడం కోసం నేను చేసే ఎక్స్‌సైజ్ నా రొటీన్ జీవితంలో ఓ భాగం కావాలని అనుకున్నాను. ఎందుకంటే కొన్ని రోజులు చేసి వదిలేస్తే మళ్ళీ బరువు పెరుగుతాము. ఇది మరింత ప్రమాదం. అందుకే కాస్త ఆలస్యంగా తగ్గినా హెల్తీగా, ఫిట్‌గా ఉండాలనుకున్నాను. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను.
అవగాహన అవసరం…
ఫిట్‌నెస్ కోసం కడుపు మాడ్చుకోవల్సిన అవసరం లేదు. హెల్తీ డైట్ తీసుకుంటూ బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండడం గురించి ఆలోచించాను. బాబుకు ఏడాది నిండిన తర్వాత నా ప్రయత్నాని మొదలుపెట్టాను. ఇలా నేను ట్రై చేస్తున్నప్పుడు నాలాగే ఎంతో మంది మహిళలు తల్లులైన తర్వాత బరువు తగ్గేందుకు ప్రయత్నించడం, రిజల్ట్ రాక ఇబ్బంది పడడం గమనించాను. అందుకే మన జీవితంలో వ్యాయామం ఎంత అవసరమో మహిళలకు అవగాహన కల్పించాలనే నిర్ణయానికి వచ్చాను. దీని కోసం ఫిట్‌నెస్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకున్నాను. వెంటనే దీనికి సంబంధించిన కోర్సుల్లో చేశారు. ఏడాదిన్నర పాటు ఫిట్‌నెస్ ట్రైనింగ్‌తో పాటు న్యూట్రిషియన్ కోర్సు కూడా చేశాను. ఎందుకంటే ఒక్క వ్యాయామాల గురించి చెబితే సరిపోదూ, దానికి తగ్గట్టు హెల్తీ డైట్ పాటిస్తే ఆరోగ్యంగా బరువు తగ్గగలుగుతాం.
నేవా ఫిట్‌నెస్ సెంటర్…
2018లో నేవా ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభించాను. మొదట్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పటికీ చాలా మంది మహిళలు వ్యాయామం అంటే బద్దకిస్తారు. అందుకే నేను మొదట సోషల్ మీడియాను ఉపయోగించుకున్నాను. వీడియోలు చేసి ఫేస్‌బుక్, ఇనిస్టాగ్రామ్, యూటూబ్‌లో పెట్టేదాన్ని. వాటిని చూసిన తర్వాత చాలా మందిలో ఆసక్తి పెరిగింది. అలా నా దగ్గరకు ట్రైనింగ్‌కి వచ్చే వారి సంఖ్య కూడా మెల్లగా పెరిగింది. ఇప్పటి వరకు 500 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చాను. వీరిలో ఎక్కువగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తెలుగువారే ఉన్నారు. హౌటల్స్, రకరకాల ఫుడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తినడం బాగా పెరిగిపోయింది. దాంతో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా కరోనా తర్వాత మరింత జాగ్రత్తగా ఉంటున్నారు.
ఫిట్‌నెస్ అంటే సన్నబడటం కాదు…
చాలా మంది పొట్ట తగ్గించుకొని సన్నగా కనిపించాలని కోరుకుంటారు. ఫిట్‌నెస్ అంటే ఇది కాదు. సన్నబడటం ముఖ్యం కాదు. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండడం అవసరం. నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి నేను ఇదే చెబుతుంటాను. వ్యాయామం చేస్తే బోన్ హెల్త్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది మన మజిల్స్ కరిగిపోతుంటాయి. ఫలితంగా జాయింట్, మెడ, వెన్ను నొప్పితో పాటు బాడీ లూజ్‌గా అయిపోతుంటుంది. నడవలేకపోవడం, నీరసం, చిన్న విషయాలకే చిరాకు వస్తుంటుంది. దీని కోసం వాకింగ్‌తో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. వ్యాయామంతో వీటన్నింటి నుండి బయటపడొచ్చు. వ్యాయామం, హెల్తీడైట్ మన రొటీన్ జీవితంలో భాగమైపోతే ఫిట్‌నెస్ దానంతట అదే వచ్చేస్తుంది.
మనం ఫిట్‌గా ఉంటేనే…
సాధారణంగా మహిళలు ఇంట్లో పనులు, పిల్లలు, భర్తను చూసుకోవడంతో అలసిపోతుంటారు. వారి ఆరోగ్యం గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. మన గురించి మనం పట్టించుకుంటేనే ఏదైనా చేయగలం. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ముందు మనం ఫిట్‌గా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యంపై శ్రద్ధ తప్పక పెట్టాలి. వ్యాయామం వల్ల ఒక్క శరీరమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. పండ్లు బాగా తినాలి. అలాగే రోజుకు నాలుగు బాదాంలు తింటే మెదడుకు మంచిది. ప్రొటీన్ కచ్చితంగా తీసుకోవాలి. నూనె బాగా తగ్గించాలి. లేదంటే డీహైడ్రెట్, ఆయాసం వస్తుంది. అన్నీ తినాలి కానీ మితంగా తినాలి. బయట ఫుడ్, జంక్, డ్రింగ్స్, ఫ్రై చేసినవి పూర్తిగా మానుకోవాలి. మంచి నీళ్లు బాగా తాగాలి.
సాహస యాత్ర
ఈ మధ్యనే 12 మంది ఫ్రెండ్స్ కలిసి మౌంట్ కైలాష్ వెళ్ళి వచ్చాం. ఇది 15 రోజుల ప్లాన్. మెల్బోన్ నుండి ముందు చైనా వెళ్ళాం. అక్కడ నుండి టిబెట్. అక్కడ బుద్దిజంకు సంబంధించిన ఆరామాలు చూశాము. అలాగే బ్రహ్మపుత్ర రివర్ చూశాము. తర్వాత సాగా, అక్కడి నుండి మౌంట్ కైలాష్‌కు బయలుదేరాం. అక్కడ విపరీతమైన చలి. మొదటి రోజు 13 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాం. దారి మొత్తం రాళ్లు, మలుపులు తిరుగుతూ ఉంటుంది. నడవడం కాస్త ఇబ్బందిగా ఉన్నా సాయంత్రం లోపు చేరాము. టెంపరేచర్ మైనస్ 10 డిగ్రీలు ఉంది. మంచు వర్షం కురుస్తుంది. ఐస్‌పై నడవాల్సి వచ్చింది. రెండో రోజు 14 కిలో మీటర్లు నడిచాం. అది చాలా ఎత్తుగా ఉండటంతో అక్సిజన్ కూడా తగ్గిపోయింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాం. మొత్తానికి చేరుకున్నాము. అక్కడ వ్యూ చాలా బాగుంది. ఇక తిరిగి వచ్చే టప్పుడు చాలా ఇబ్బంది అయ్యింది. మంచు వర్షం కురుస్తూనే ఉంది. దారిలో నాలుగు సార్లు స్లిప్ అయ్యాను. దెబ్బలు కూడా తగిలాయి. మూడో రోజు 24 కిలో మీటర్లు నడవాల్సి వచ్చింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయి. ఆ రోజు 12,13 గంటలు నడుస్తూనే ఉన్నాం. 4వ రోజు 7 కిలో మీటర్లు నడిచాం. తిరిగి ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి చేరుకున్నాం. తర్వాత నేపాల్ వెళ్ళాం. మూడు రోజులు అక్కడ ఉండి తిరిగి బెల్బోన్ వెళ్ళిపోయాము. సాహసంతో కూడిన ప్రయాణమైనా గొప్ప అనుభూతినిచ్చింది. మనం ఫిట్‌గా ఉంటే ఇలాంటి సాహస యాత్రలు ఎన్నో చేయవచ్చు.