కేవలం దయాగుణంతోనే ఈ ప్రపంచాన్ని మార్చొచ్చు

Only kindness can change this worldవిశ్వ దయాగుణోద్యమం (GLOBAL KINDNESS MOVEMENT)లో భాగంగా ప్రతి సంవత్సరం 13 నవంబర్‌ న ప్రపంచ దయాగుణ దినాన్ని (WORLD KINDNESS DAY) జరుపుకుం టున్నాం. మానవీయ విలువల్ని పెంపొందిం చుకోవడానికి ప్రేమ, సౌహార్ద్రాలతో మానవ జీవనం మనుగడ సాగించడానికి. ఒకరి పట్ల ఒకరికి గల గౌరవాన్ని, బాధ్యతను తెలుపుకో వడానికి ఈ రోజును జరుపుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు జాతుల మధ్య, సమాజాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య కూడా వెల్లివిరియాలని. ‘వసుదైక కుటుంబకం’ అనే భావన అన్ని రకా లుగా, అన్ని స్థాయిల్లో ఏర్పడాలనీ – అంతకు ముందు ఏర్పడింది వర్థిల్లుతూ ఉండాలనీ ఒక ఆకాంక్షతో, ప్రపంచ పౌరులు ఈ రోజును జరుపుకుంటున్నారు. సంతోషాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి పసుపు పచ్చరంగును సంకేతంగా ఎంచుకున్నారు. మొదటిసారిగా ఇది 1998లో ప్రారంభమైంది.
”ఒక చిరునవ్వే దయాగుణానికి సంబంధించిన అంతర్జాతీయ భాష చెవిటి వాళ్లు వినగలిగేది, గుడ్డివాళ్లు చూడగలిగేది కేవలం దయాగుణాన్ని మాత్రమే”.
– ప్రపంచ ప్రసిద్ధ రచయిత మార్క్‌ ట్విన్‌.
దయాగుణాన్ని మించిన విజ్ఞత మరొకటి లేదు. దయా గుణమనేది ఒక గొప్ప కానుక. అది ఉచితంగా ఇవ్వగలిగేది. దాన్ని తప్పకుండా పంచుతూ పోవాలి. ఎదుటివాళ్లు ఎవరూ అని చూడకుండా, తిరిగి వాళ్లు మనకేమివ్వగలరని చూడ కుండా, ఇతరులకు ఇస్తూ ఉండడమే దయాగుణం! అలాంటి వారి దగ్గర ఉన్న దయా ధనం ఎన్నటికీ తరిగిపోదు. ఇతరు లకు ఇచ్చి పేదవాడై పోయిన వాడు, చితికి పోయినవాడు, చెడిపోయినవాడు. ప్రపంచంలో ఎవడూ లేడు, దయలోంచి వచ్చిన ప్రేమతో చెప్పిన – చిన్న మాటయినా సరే, ఎదుటి వారి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి మార్చేస్తుంది కూడా! దయతో చేసే చిన్న సహాయమైనా సరే, దానికి ప్రేమను జత చేస్తే – ఆ సహాయం విలువ ఎన్నోరెట్లు పెరుగుతుంది. అందుకే మనుషుల్లో దయా గుణాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికే ప్రపంచ కరుణ రస దినాన్ని’ జరుపుకుంటూ ఉండాలి. మనమంతా మనుషుల మన్నది గుర్తు చేసుకుంటూ ఉండాలి!
మనమంతా ఒక్కటే – అన్న భావన ఉన్నప్పుడే పైవన్నీ జరుగుతాయి. మనుషుల్లో స్థాయీ భేదాలు లేవు. అందరం ఒక్కటే అన్నది ఆధునిక జన్యు శాస్త్రం చెప్పింది. ఇందులో ఏ ఒక్క విషయమూ దేనికదే విడిగా ఉండదు. ఎందుకంటే అన్నీ ఒక దానితో ఒకటి అంత ర్గతంగా పెనవేసుకుని ఉన్న విషయాలు మంచి తనం లేకపోతే దయాగుణం ఉండదు. మంచి వాడు కాగానే సరిపోదు. అతడు జ్ఞానవంతుడై నపుడే సమాజానికి ఉపయోగపడతాడు. అజ్ఞాని గా ఉన్నవాడికి ఏది మంచో ఏది చెడో తెలియ దు. దయ ఎప్పుడు ఎవరి మీద చూపాలో తెలి యదు. ఇలా ఒక దగ్గర కదిలిస్తే తీగంతా కదు లుతుంది. ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, ప్రపంచం వర్థిల్లాలంటే ముందు వైజ్ఞానిక దృక్ప థం అవసరం. అది నిండుగా ఉన్నవాడే విశ్వ మానవుడవుతాడు. అలా అయినప్పుడే వ్య క్తుల నుండి దేశాల దాకా ఆ స్థాయిలో చేయవల్సిన పనులు ఏమిటన్నది నిర్ణయించుకోగలడు.
దయను చూపించు- ‘BE KIND’ అని 13 నవంబర్‌న ఒక్కరోజు ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద తిరగడం కాదు. జాతుల మధ్య వైరాల్ని దేశాల మధ్య యుద్ధాల్ని ఆపడానికి చేయాల్సిన కార్యక్రమాలేవో ఆలోచించుకోవడానికి, చర్చించు కోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని ఆచరించడానికి’WORLD KINDNESS DAYμ స్పూర్తి నివ్వాలి! కులమతాల, జాతుల, ప్రాంతీయ హద్దుల్ని, రాజకీయ విభేదాల్ని, దేశాల సరి హద్దుల్ని దాటి – విశ్వ జను లందరూ ఒక సదభిప్రాయ సోదరత్వ భావనకు రావ డానికి ఈ ‘వరల్డ్‌ కైండ్‌ నెస్‌ డే’ తోడ్పడాలి! మంచి కృషిని అభినందించడా నికి, మంచి అవగాహ నను పెంచడానికి, మాన వాళిని ఒక దయాగుణం తో ఐక్యం చేయడానికి. ప్రపంచ వ్యాప్తంగా మానవుల స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ‘వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే’ జరుపుకుంటూ ఉండాలి!!
ఈ ప్రపంచాన్ని మార్చడం ఎలాగా? అని తల బద్దలు కొట్టుకోనవసరం లేదు. అది నిస్సందేహంగా దయాగుణంతోనే సాధ్యం. దాన్ని వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో గౌతమ బుద్ధుడు ఆచ రించి చూపాడు. అనుసరించమన్నాడు. కానీ, కొన్ని దుష్ట శక్తులే ప్రతిబంధకమయ్యాయి. వాటిని ఇప్పుడు ఛేదించు కుంటూ ముందుకు పోవాల్సి ఉంది. ‘నువ్వే దీపానివైపో’ – అన్నాడు బుద్ధుడు. నువ్వు దీపానివైనపుడు సహజంగా నీ నుండి వెలుగులు ఇతరులకు అందుతాయి. దీపమంటే జ్ఞానం, నువ్వే జ్ఞానానివైనప్పుడు నీ నుండి జ్ఞానం ఇతరులకు అందుతుంది. నువ్వు దీపమైనా, జ్ఞానమైనా-వెలుగుల్ని, జ్ఞా నాన్ని ఇతరులకు అందించాలంటే నీకు దయాగుణం ఉండ డం తప్పనిసరి! నువ్వే దయా గుణానివై పో- అప్పుడు దయా గుణం నీ నుండి ఇతరులకు అందుతుంది – ప్రపంచంలో దయార్ధ్ర హృదయులెందరో ఉన్నారు.నీకు ఎవరూ కనబడడం లేదని బెంబేలు పడతావెందుకూ? నువ్వే దయామయుడవై పోవచ్చు కదా? నీకు ఆ అవకాశముంది. ప్రపంచ పౌరులం దరూ ఆ అవకాశాన్ని తీసుకుంటే సమాజాలు దేశాలూ మారి పోతాయి! యుద్ధాలు ఆగిపోతారు!!
మూర్ఖుడి దగ్గర బోలెడంత మూర్ఖత్వం ఉంటుందికదా? దాన్ని ఇతరులకు దయతో పంచుతూ ఉంటే ప్రపంచం మూర్ఖ ప్రపంచం అవదా? అని కొందరికి అనుమానం రావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి.మూర్ఖుడికి కోపం, క్రోధం, అహంకారం, అసహనం లాంటివి ఉంటాయి. అవి వదిలేస్తేనే వాడు విజ్ఞుడవుతాడు. మంచివాడవుతాడు అప్పుడే అతనికి దయాగుణం అబ్బుతుంది.
అంతర్జాతీయంగా 13 నవంబర్‌ 1998న ప్రారం భమైన ఈ దయాగుణదినం ఆస్ట్రేలియా, కెనడా, నైజీ రియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌, ఇటలీ, యు.కె.లో మాత్రమే కాదు. భారతదేశంలో కూడా జరుపుతున్నారు. వివిధ దేశాలలో సుమారు 38 ప్రధాన ప్రపంచ మహానగరాల్లో జరు పుతున్నారు. దేశాలన్నింటితో సంతకాలు చే యించి. సమైక్యంగా ఒక డిక్లరేషన్‌ విడుదల చేయించాలని ఐక్యరాజ్య సమితికి నివేదికలు అందాయి. త్వరలో దానికి ఒక రూపం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆ రోజు ఏం చేస్తున్నారంటే – పరిచయం ఉన్నా, లేక పోయినా అందరితో చేతులు కలిపి ‘హేప్పీ కైండ్‌నెస్‌ డే’ – అని చెప్పుకోవడం. ఒకరికి ఒకరు పసుపు పచ్చని పూలు ఇచ్చుకోవడం. దగ్గరికి తీసు కుని హత్తుకోవడం చేస్తున్నారు. దయా గుణం ఇతివృత్తంగా కొన్ని దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకత గురించి ఎన్నో దేశాల్లో ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రియమైన వారి దగ్గరికెళ్ళి వారి వల్ల తమ జీవితమెంత ఉత్తేజితమయ్యిందో సౌమ్యంగా చెప్పుకుంటారు. లేదా ఒక మెసేజ్‌/ఇ-మెయిల్‌ పంపుకుంటారు. అందుబాటులో ఉంటే వారి కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద గాని, వారి కారు ముందు అద్దం మీద గానీ మంచి సందేశం – కామెంట్‌ పెడతారు. ఇవన్నీ ఎందుకంటే స్నేహ బంధాల్ని, బాంధవ్యాల్ని మరింత లోతుగా పటిష్ట పరుచు కోవడానికే – ఇలాంటి ప్రయత్నాలు సంఘాల మధ్య, సమా జాల మధ్య, దేశాల మధ్య కూడా జరుగుతున్నాయి. అవి ఇంకా జరగాలి అప్పుడే ‘వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే’ సార్థకమౌతుంది.
ఇవన్నీ కాకుండా పాఠశాల, కళాశాల పిల్లలకు – సహా యం చేయడం గురించి, దయ చూపించడం గురించి బోధిస్తు న్నారు. ఆ లేత మనసుల్ని మంచి ఆలోచనలతో నింపుతు న్నారు. దగా, మోసం వంటి వాటిని అణిచిపెట్టి దయ, సాను భూతి, సహకారం వంటి వాటిని పిల్లల మనసుల్లో నాటు కునేట్లు చేయాలని ప్రయత్నాలు జరుగు తున్నాయి. పిల్లల పట్ల శ్రద్ధ చూపే ఈ కార్యక్రమాలకు ఎన్‌జిఓలు, ప్రయివేట్‌ సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ కొన్ని దేశాలలో నైతే చాలా చురుకుగా పాల్గొంటున్నాయి. సంప్రదాయాల పేరుతో అబద్దాల కట్టుకథల ఆధారంగా చేసుకునే పండగలు మానె య్యాలి. వాస్తవాలేమిటో, నిజాలేమిటో తెలుసుకోగలగాలి. మనిషి కేంద్రంగా అతడు సాధించిన ఘన విజయాల్ని నెమరువేసుకోవాలి! ఆధునిక జీవితానికి దోహదపడే విధంగా సమాంతర వేడుకలకు, ఉత్సవాలకు రూపకల్పన చేసుకోవాలి! పాత నిర్వచనాల్ని తప్పదు – మార్చుకోవాలి!!
దయా గుణానికున్న ఔన్నత్యాన్ని భ్రమల్లో, కల్పితాల్లో ద్విగిణీకృతం చేసుకున్నంత మాత్రాన సమాజంలో మార్పు రాదు. వాస్తవ జగత్తులో ప్రత్యక్షంగా దాన్ని అనుభవంలోకి తెచ్చినపుడే సమాజ స్వరూపం మారుతుంది. జీవిత మంటే నటిస్తూ వినోదం అందించే నాటకమో, సినిమాయో, టి.వి. సీరియలో కాదు. జీవితం ఉన్నది జీవించడానికి! జీవితంలో ఉండాల్సినవి నిజం, నిబద్దత, ప్రేమ, ఆప్యాయత, సహనం, సహకారం- మనసు లోతుల్లో దయాగుణం లేకపోతే ఇవేవీ ఉండవు –
ఒక్క క్షణం – ఒక రోజునే మార్చగలదు
ఒక్క రోజు – ఒక జీవితాన్నే మార్చగలదు
ఒక్క జీవితం – ప్రపంచాన్నే మార్చగలదు – బౌద్ధ ద్ధమ్మం

A WARM SMILE IS THE UNIVERSAL
LAGUAGE OF KINDNESS.
HAPPY KINDNESS DAY TO ALL.
(13 NOVEMBER 2023 WORLD KINDNESS DAY)
– సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌
(మెల్బోర్న్‌ నుంచి)డాక్టర్‌ దేవరాజు మహారాజు