సమాజ హితానికి అవసరమయ్యే వార్తలకే సముచిత స్థానం ఇవ్వాలి

Only news that is necessary for the welfare of society should be given proper place– జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర 
– సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువగా ఉన్నత విద్యా వంతులే 
– సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ టి. లక్ష్మీనారాయణ
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
సంచలన వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం కల్పిస్తే సమాజంలో మార్పుకు మనం నాంది కావచ్చు. ప్రతీ రోజు నిరంతరం మనం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా జర్నలిజంలో నిరంతరం మనల్ని మనం నవీకరించుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు పాలనాధికారి   పూర్ణ చంద్ర అన్నారు. గురువారం అంబేద్కర్ భవన్ లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వార్త లాప్ – వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం నవీకరించుకుంటూ, సమాజంలో 4వ స్తంభం గా మీడియా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తే సమాజంలో  మంచి మార్పును మనం చూడవచ్చు అని అన్నారు. ప్రజాభిప్రాయ ప్రకారం నిజ నిర్ధారణ చేసుకొని వార్తలు రాస్తే బాగుంటుందని, పిఐబి లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేడు మన మధ్యకు వచ్చి జిల్లా స్థాయిలో వర్క్ షాప్‌లను నిర్వహిస్తోందని, ఇందుకు పిఐబి బృందాన్ని అభినందిస్తున్నానని అన్నారు. దైనందిత జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎగ్జిబిషన్ ని సాధ్యమైనంత వరకు అందరూ ఒకసారి తిలకించి అవగాహన పెంచుకోవాలని కోరారు.
అనంతరం సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ మాట్లాడుతూ ఇంతకు ముందు నేరాలలో బాధితులు, నేరస్థులు ఉండేవారు. కానీ ప్రస్తుతం సైబర్ క్రైమ్ లో నేరస్థులు ఎక్కడో ఉండి మనకు చేయాల్సిన నష్టం చేస్తూనే ఉంటారని, రాష్ట్రంలో ప్రతీ రోజూ సుమారు రూ.5-6 కోట్ల మధ్య సైబర్ మోసాల వల్ల  నష్టపోతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువగా ఉన్నత విద్యా వంతులే, 90 శాతం కి పైగా  ఉన్నారని పేర్కొన్నారు. సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాత్రికేయుల మిత్రులదనే ఉందని, ఎన్సిఆర్పి పోర్టల్ లేదా1930 ద్వారా సైబర్ మోసాన్ని తెలియజేయవచ్చని తెలిపారు.పి ఐ బి డిప్యూటీ డెరైక్టర్ డా.మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు, మీడియా కు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. వర్క్ షాప్ కి వక్తగా హాజరైన దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ, కచ్చితమైన వార్తలను సేకరించి ప్రజలకు మరిన్ని మంచి వార్తలు అందేలా చూడాలని అన్నారు.డాక్ సైంటిస్ట్  జగదీప్ బాబు మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో మనం కేవలం వార్తలే కాకుండా మనం వాడే మొబైల్ ఫోన్లు తరచూ అప్డేట్ చేస్తూ ఉండాలని, ఈ సైబర్ యుగంలో మనం డేటా ను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గురించి నల్లగొండ జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి  కోటేశ్వర రావు వివరించారు. పిఐబి పనితీరు గురించి పిఐబి అధికారులు గాయత్రి, శ్రీ శివచరణ్ రెడ్డి వివరణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో  పిఐబి అధికారులు, సిబ్బంది, సిబిసి సిబ్బంది, డిపిఆర్ఓ  వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.