ముగ్గురిలో ఇద్దరే…

Two out of three...– ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటి వరకు ఐదేండ్లు పనిచేసిన సీఎంలు
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడి 2 దశాబ్దాలకు పైగా గడిచింది. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని 16 జిల్లాలను విడదీసి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 23 సంవత్సరాలు. అయితే, ఈ కాలంలో రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే చేశారు – అజిత్‌ జోగి, రమణ్‌ సింగ్‌ , భూపేష్‌ బఘేల్‌. దివంగత అజిత్‌ జోగి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. నవంబర్‌ 2000 నుంచి డిసెంబర్‌ 2003 వరకు సీఎం పదవిలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీకి చెందిన రమణ్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని పూర్తి చేసిన మొదటి ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, ఆ రాష్ట్రానికి ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన నిలిచారు. 2003 నుంచి 2018 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఈ పదవిలో కొనసాగారు.రమణ్‌ సింగ్‌ 1976 -77లో బీజేపీలో యువ సభ్యునిగా చేరారు 1990, 1993లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడగానే పార్టీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ఆయన నాయకత్వంలో 2003 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిని చేశారు. దాదాపు 15 ఏండ్ల తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో రమణ్‌ సింగ్‌ నేతత్వంలోని బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ విజయం సాధించింది. నవంబర్‌ 7, మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌ జరుగుతున్న హై ప్రొఫైల్‌ సీట్లలో రమణ్‌ సింగ్‌ స్థానం ఒకటి.
ఛత్తీస్‌గఢ్‌లో మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేష్‌ బఘేల్‌ ఈ ఎన్నికలతో రాష్ట్రంలో తన తొలి పదవీకాలం పూర్తి చేసుకోనున్నారు. ముఖ్యమంత్రి కాకముందు ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిపోయిన కాంగ్రెస్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వ్యూహంతో పార్టీలో బఘెల్‌ వంటి నేతలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 68 స్థానాలతో చరిత్రాత్మక మెజారిటీ సాధించింది. అయితే బీజేపీ కేవలం 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.రాజీవ్‌ గాంధీ కిసాన్‌ న్యారు యోజన వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించినందుకు బఘేల్‌ ప్రసిద్ధి చెందారు. ఈ పథకం కింద మొక్కజొన్న, కోడో, కుట్కీ, సోయాబీన్‌, అర్హర్‌, చెరకు పండించే రైతులకు ఎకరాకు రూ.9,000 అందజేస్తారు. బఘేల్‌ తన పటాన్‌ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన స్థానిక పండుగలు, క్రీడలు, కళ , సంస్కతిని ప్రోత్సహిస్తున్నారు.ప్రస్తుత ఎన్నికల్లో బఘేల్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆధారంగా తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ను అవినీతి ఆరోపణలతో కార్నర్‌ చేస్తోంది. మహదేవ్‌ బుక్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో నిందితుడు శుభమ్‌ సోనీకి సంబంధించిన వీడియోను పార్టీ ఇటీవల విడుదల చేసింది. వీడియో ప్రకారం, బఘేల్‌కు దాదాపు రూ. 508 కోట్లు చెల్లించినట్లు తమ వద్ద ‘రుజువు’ ఉందని సోనీ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ బెట్టింగ్‌ యాప్‌ సిండికేట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరుపుతోంది.