– 50 ఏండ్లు నిండిన ప్రతి వడ్డెర వృత్తిదారుడికీ పెన్షన్ ఇవ్వాలి
– వడ్డెర సంఘం అధ్యక్షుడు వరికుప్పల ఎల్లస్వామి
నవతెలంగాణ-తుర్కయంజాల్
క్వారీలు, గుట్టలపై వడ్డెర వృత్తిదారులకు మాత్రమే పూర్తి హక్కులు కల్పించాలని ఆ సంఘం ఇబ్రహీంపట్నం ఇంద్రారెడ్డినగర్ అధ్యక్షుడు వరికు ప్పల ఎల్లస్వామి, కార్యదర్శి దండుగుల రాజు డిమాండ్ చేశారు. తుర్కయం జాల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి 76 ఏండ్లు గడచినా వడ్డెర వృత్తిదారుల బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉం దని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీలపై, గుట్టలపై హక్కులు పూర్తిగా ప్రయి వేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, దీంతో వడ్డెరల జీవితాలు నాశనమై పోతున్నాయని అన్నారు. వడ్డెరలకు క్వారీలపై, గుట్టలపై హక్కులు కల్పిస్తేనే వారి జీవితాలు బాగుపడతాయని అన్నారు. ప్రభుత్వం ఈ దిశగా అలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 50 ఏండ్లు నిండిన ప్రతి వడ్డెర వృత్తిదారుడికీ పెన్షన్ ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా వడ్డెర ఫెడరేషన్‌కు చైర్మెన్‌ను నియమించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వడ్డెర సొసైటీలకు లోన్లు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టుల్లోనూ 30 శాతం పనులు ఇచ్చి కేటాయించి, రూ.5 కోట్ల వరకు ఎలాంటి ఈఎండీ లేకుండా పనులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పని చేస్తున్న సమయంలో అనేక మంది ప్రమాదాలకు గురై కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులుగా మారుతున్నారని, కొంతమంది ప్రాణాలు పోగొ ట్టుకుంటున్నారని, ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చనిపోయిన వడ్డెర వృత్తిదారులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దండుగుల పెద్ద రాజు, మల్లేష్, రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.