ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు 22

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువు ఈనెల 22 వరకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) డైరెక్టర్‌ పివి శ్రీహరి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల తొమ్మిది నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించాలని కోరారు. తుది గడువు ఈనెల 22 వరకు ఉందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.25తో ఈనెల 29 వరకు, రూ.50తో వచ్చేనెల మూడు వరకు, తత్కాల్‌ పద్ధతిలో అదేనెల ఆరో తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ లేదా మేలో ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు http://telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.