భార్యా భర్తల మధ్య కమ్యూనికేషన్ లేకపోతే ఆ బంధంలో ఎలాంటి మాధుర్యం ఉండదు. ఏదో కలిసి ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టు ఉంటుంది. ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ ఏ బంధమైనా బలపడేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది లేకపోతే అపార్థాలు పెరిగిపోయి, బంధాల మధ్య కోపం, అహం మొదలవుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఒకరి నుండి మరొకరు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోగలుగుతారు. ఎవరైనా సరే వారు ఆశించినది అందనప్పుడు కచ్చితంగా కుంగిపోతారు. అక్కడి నుండే గొడవలు మొదలవుతాయి. చాలా జంటలు సీరియస్ విషయాలను కూడా బాగా అర్థం చేసుకుంటారు. కానీ చిన్న చిన్న విషయాలకు మాత్రం గొడవలు పడుతుంటారు. ఎందుకంటే ఆ విషయాలే వారి మనసును బాధిస్తాయి. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదువుదాం…
అనితకు 35 ఏండ్లు ఉంటాయి. పెండ్లయి 10 ఏండ్లు అవుతుంది. ఒక పాప ఉంది. భర్త విజరు ఆమెకన్నా పదేండ్లు పెద్దవాడు. వీరితో పాటు ఇంట్లో అత్త కూడా ఉంటుంది. పాప స్కూల్‌కి వెళుతుంది. అనిత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నారా! వాళ్ళ అత్తయ్యతో కూడా ఆమెకు పెద్ద సమస్యలేమీ లేవు. అత్తతో చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటి గురించి అనిత పెద్దగా పట్టించుకోదు. మరి సమస్య ఏంటీ అంటున్నారా? భర్త ఆమెతో రోజులో కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడడు. ఇంటికి రాగానే టీవీ లేదా ఫోన్ చూస్తూ కూర్చుంటాడు.
ఆరోగ్యం బాగాకపోయినా ఆమె దగ్గర కూర్చొని పరామర్శించడు. కాస్త జ్వరం వచ్చిందంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళతాడు. కానీ ఆమెతో మాత్రం ఉండడు. ‘మందులు వేసుకున్నావుగా తగ్గిపోతుందిలే’ అంటాడు తప్ప ఆమె కోసం కాసేపు కూడా ఇంట్లో ఉండడు. ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా, పెండిండ్లు ఉన్నా, వాళ్ళ స్నేహితుల దగ్గరకు వెళ్ళాలన్నా అప్పటికప్పుడు చెప్పి హడావుడిగా రెడీ చేసి తీసుకెళతాడు. ముందే సమాచారం ఇవ్వడు.
‘బయటకు వెళ్ళాలని ముందే చెబితే ఆఫీస్‌లో పని త్వరగా ముగించుకొని రావడం, పర్మిషన్ తీసుకోవడం లేదా లీవ్ తీసుకోవడమో చేస్తాను. సడన్‌గా చెప్తే ఆఫీస్‌లో ఊరుకోరు. పోనీ నేను రాను మీరు వెళ్ళండి అంటే ఒప్పుకోడు. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా నీకు నాకంటే ఆఫీసే ఎక్కువయింది అంటారు. ఉద్యోగం చేస్తున్నపుడు దానికి న్యాయం చేయాలి కదా! అనేది నా విధానం
అసలు నన్ను ఓ మనిషిగానే చూడడు. ఓ యంత్రంలా భావిస్తాడు. నైట్ అయినా నాతో కాసేపు గడుపుతారు అంటే అదీ లేదు. ‘నువ్వు వెళ్ళి పడుకోపో నేను తర్వాత వస్తాను’ అంటారు. ఆఫీస్ వర్క్‌లో ఏమైనా బీజీగా ఉన్నారా అంటే అదీ లేదు. ఎప్పుడూ టీవీ చూస్తూనో, ఫోన్ చూస్తూనో గడుపుతారు. ఆయనకు అవసరమైనప్పుడు మాత్రం దగ్గరకు తీసుకుంటాడు. నాకు ఇష్టమో లేదో కూడా పట్టించుకోడు. నేను కూడా ఓ మనిషినే కదా. నా ఇష్టంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రవర్తిస్తారు.
నేనేమైనా అవసరం ఉండి పని చెప్తే పట్టించుకోడు. నన్ను నా భర్త ఓ వస్తువుగా చూస్తున్నారు. అలా అని ఆయనకు ప్రేమా లేదా అంటే ఉంది. కానీ దాన్ని నాతో సరిగ్గా చెప్పడం లేదు. నాతో మాట్లాడడు. అంతెందుకు ఆయనకు సంబంధించిన ఏ విషయం నాకు తెలియదు. పెండ్లి జరిగి 10 ఏండ్లు అవుతుంది. కానీ విజరుకు ఎంత జీతం వస్తుందో, ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా తెలియదు. ఎంత సేవింగ్ ఉందో, భవిష్యత్ ఎలా ఉంటుంది. అసలు మా పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావడం లేదు’ అంటూ అనిత కన్నీరు పెట్టుకుంది.
అనిత బాధంతా విన్న తర్వాత మేము విజరును పిలిపించి మాట్లాడితే ‘అనితతో మాట్లాడటానికి ప్రత్యేకంగా ఏం ఉంటుంది. ఆమె ఉద్యోగం చేస్తుంది. కాబట్టి నా దగ్గర డబ్బులు కూడా తీసుకోదు. ఆమెకేం కావాలో ఆమే కొనుక్కుంటుంది. దానికి నా అవసరం ఏమీ లేదు. ఇక పెండిండ్లు, ఫంక్షన్లు అంటే ఆమెకు ముందే తెలుసు కదా! ఆ రోజు వెళ్ళాలి అనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఆఫీస్ నుండి రాగానే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. నాకేం కావాలో అడక్క ముందే నాకు ఇస్తుంది. టీ ఇవ్వు అని కూడా అడగాల్సిన అవసరం లేదు. ముందే తెచ్చి నా చేతికిస్తుంది. తన పని తాను చేసుకొని పడుకుంటుంది. నువ్వెందుకు నాకంటే ముందే పడుకుంటున్నావు అని కూడా నేను అడగను. ఆమెకు ఎలా నచ్చితే అలా ఉండనిస్తాను. ఆమె నిర్ణయాలను గౌరవిస్తాను. ఆరోగ్యం బాగోకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళతాను. వంట చేయలేకపోతే బయట నుండి తెచ్చి పెడతాను. ఇక నాకు నచ్చినప్పుడు తనతో గడుపుతాను. దానికి కూడా ఆమె పర్మిషన్ తీసుకోవాలా! తను నా భార్యే కదా! నా భార్యా నా ఇష్టం. నేను ఎప్పుడూ ఆమెను తిట్టలేదు, కొట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
విజరు చెప్పింది మొత్తం విన్న తర్వాత ‘ఏ బంధమైనా బలంగా ఉండాలంటే మనసు విప్పి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా భార్యా భర్తల్లో ఇది చాలా ముఖ్యం. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవాలి. ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవాలి. అవి తెలియాలంటే ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అది మీ మధ్య జరగడం లేదు. ఫంక్షన్‌కి వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ముందే మాట్లాడుకోవాలి. ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది కదా! తనూ పర్మిషన్ తీసుకోవాలి. ఆరోగ్యం బాగోకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళతా అంటున్నారు. అదొక్కటే సరిపోదు ఆమెతో కాసేపు మాట్లాడాలి. నా భర్త నాతో ఉన్నాడు అనే భరోసా ఆమెకు మానసిక శక్తిని ఇస్తుంది. అది ఆమెకు మరింత బలాన్ని ఇస్తుంది. అది కూడా ఓ మెడిసెన్ లాంటిదే అని గుర్తించండి. అనిత మీ నుండి ఏం కోరుకుంటుందో ముందు తెలుసుకోండి. ఆమె కోసం కాస్త సమయం కేటాయించండి.
నా భార్య నా ఇష్టం అంటున్నారు. ఆమే ఓ మనిషే కదా. తనకూ ఫీలింగ్స్ ఉంటాయి కదా! అవి మీరు పట్టించుకోవడం లేదు. ఆమె మనసుకు నచ్చనప్పుడు మీరు ఆమెతో గడిపినా దాని వల్ల ఉపయోగం ఉండదు. ముందు ఆమె మనసేంటో తెలుసుకోండి. అప్పుడు మీ ఇద్దరూ ఆనందంగా ఉండొచ్చు’ అన్నాము. దానికి అతను ‘మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను అనిత మనసు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నా భార్యే కదా ఏలాగైనా ఉండొచ్చు అనుకున్నాను. నాది పొరపాటే. ఇప్పటి నుండి కచ్చితంగా తనతో సమయం గడుపుతాను. మీరు చెప్పినట్టు నడుచుకుంటాను’ అని చెప్పి అనితను తీసుకొని వెళ్ళిపోయాడు.
– వై వరలక్ష్మి,
9948794051