అర్ధ శతకాలతో చెలరేగిన ఓపెనర్లు..

– వరుసగా రెండో విక్టరీ కొట్టిన భారత్‌
కొలంబో: ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో భారత్‌-ఏ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో యూఏఈ ఘన విజయం సాధించిన భారతజట్టు రెండో మ్యాచ్‌లో నేపాల్‌ 9వికెట్ల తేడాతో గెలిచింది. ప్రేమదాస స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ జట్టు 39.2ఓవర్లలో 167పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌(65) అర్ధ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఆమాత్రమైనా స్కోర్‌ చేయగల్గింది. హంగర్గేకర్‌ మూడు, హర్షిత్‌ రానాకు రెండు వికెట్లు దక్కాయి. నిషాంత్‌ సింధు(4/14), హంగర్గేకర్‌(3/25), హర్షీత్‌ రాణా(2/16) బౌలింగ్‌ లో రాణించారు. ఛేదనలో భారత ఓపెనర్లు సాయి సుదర్శన్‌(58నాటౌట్‌), అభిషేక్‌ శర్మ(87) అర్ధ సెంచరీలతో మెరిశారు. అభిషేక్‌ తర్వాత వచ్చిన దృవ్‌ జురెల్‌(21నాటౌట్‌) సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో భారతజట్టు 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. ఛేదనలో భారత జట్టు 22.1 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్రూప్‌-ఏ మరో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 184పరుగుల తేడాతో యుఏఇపై నెగ్గింది. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో ఉంది. రేపు(బుధవారం) పాకిస్తాన్‌-ఏ – ఇండియా -ఏ జట్ల మధ్య ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది.