– మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ
– రూ.5 కోట్ల నిధులతో సకల హంగులతో భవన నిర్మాణం
– ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
– ముఖ్య అతిథులకు ఆహ్వానాలు అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయం భవనం ఈ నెల 5న ప్రారంభోత్సవం అవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీ కార్యాలయ భవనం లేకపోవడంతో పాత గ్రామపంచాయతీ భవనంలోనే మున్సిపల్ అధికారులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సరైన గదులు లేక ఇబ్బందులు పడుతుండడంతో సమస్య ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దష్టికి వెళ్లడంతో భవన నిర్మాణాన్ని కావలసిన ఐదు కోట్ల రూపాయలు నిధులను ఆయన వెంటనే మంజూరు చేయించారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు చైర్పర్సన్ కతజ్ఞతలు తెలిపారు. సకల హంగులతో నిర్మించిన పుర భవన ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఆప్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌లకు ఇప్పటికే ఆహ్వానాలను అందజేసినట్టు తెలిపారు. మున్సిపాలిటీ భవన ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లను పూర్తి చేసి కార్యాలయాన్ని సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చైర్‌పర్సన్ కోరారు.