మంచిర్యాలలో ‘ఆపరేషన్‌ చభూత్ర’

మంచిర్యాలలో 'ఆపరేషన్‌ చభూత్ర'– అర్ధరాత్రి తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు
– మంచిర్యాల డీసీపీ భాస్కర్‌
నవతెలంగాణ-మంచిర్యాల
అకారణంగా అర్థరాత్రి పట్టణంలో తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్‌ తెలిపారు. సోమవారం అర్థరాత్రి మంచిర్యాల పట్టణంలో ఆపరేషన్‌ ఛభుత్రలో భాగంగా ఏసీపీ ప్రకాష్‌, సీఐ బన్సీలాల్‌తో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రతి రోజు రాత్రి పట్టణంలో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని రాత్రి మద్యం సేవించి వాహనాలపై తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయడంతో పాటు వాహనాలు సీజ్‌ చేసి పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం రాత్రి నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టణంలో తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకొని 54 ద్విచక్ర వాహనాలపై, 5 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న యువకులకు మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలలో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని, తల్లి తండ్రులు పిల్లల నడవడికను అనునిత్యం గమనిస్తూ ఉండాలని సూచించారు. అదుపులోకి తీసుకున్న వాహనాలను మంచిర్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు మహేందర్‌, ప్రశాంత్‌, సనత్‌, సురేష్‌, సుగుణకర్‌ పాల్గొన్నారు.