కర్నాటకలో మళ్లీ ఆపరేషన్‌ కమలం

– కాంగ్రెస్‌ సర్కారుకు ముప్పు తప్పదు : బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రజాతీర్పును గౌరవించకుండా అధికారమే పరమావధిగా రాజకీయం చేయటం బీజేపీకి అలవాటుగా మారింది. గతంలో మధ్యప్రదేశ్‌, గోవా, కర్నాటక సహ ఇతర రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులను నయానో,భయానో తమ వశం చేసుకుని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కమలం పార్టీ కన్ను ఇపుడు మరోసారి కర్నాటక సర్కార్‌పై పడింది. కర్నాటకలో త్వరలో ఆపరేషన్‌ కమలం ప్రారంభం కానున్నదని బీజేపీ నేత కె.ఎస్‌. ఈశ్వరప్ప ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండదని అన్నారు. కర్నాటకలో ఆపరేషన్‌ కమలం ప్రారంభమవుతుందని వందశాతం హామీ ఇవ్వగలనని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని.. 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం పట్ల ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. దానిని సరిదిద్దేందుకు యత్నిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ కూడా అంగీకరించారని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డి.కె. శివకుమార్‌లకు పలు అంశాలపై విభేదాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయ సమీకరణలు చూసుకుని అవకాశం రాగానే ఆపరేషన్‌ కమలం అమలు చేసి అధికారంలోకి వస్తామని తెలిపారు.