ఆపరేషన్‌ ‘ముదిరాజ్‌…’

Operation 'Mudiraj...'– గజ్వేల్‌, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డిలో వారి ఓట్లే కీలకం
– త్వరలో కారెక్కనున్న బిత్తిరి సత్తి
– కాసాని జ్ఞానేశ్వర్‌తోనూ గులాబీ పెద్దల మంతనాలు
– ఆ సామాజిక తరగతికి బీఆర్‌ఎస్‌ వల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రమంతటా ఒక ఎత్తు.. ‘ఆ నాలుగు నియోజకవర్గాలు మరో ఎత్తు…’ అన్నట్టుంది ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పరిస్థితి. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్ధిపేటతోపాటు ముఖ్యమంత్రి పోటీ చేయబోయే కామారెడ్డి ఇప్పుడు గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. తాజా రాజకీయ పరిణామాలతో ఆయా స్థానాలు కొంతలో కొంత అధికార పార్టీకి సమస్యాత్మకంగా కూడా మారినట్టు తెలుస్తోంది. 2014 నుంచి గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్ధిపేటలో వారు ముగ్గురూ బంపర్‌ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ముదిరాజ్‌ సామాజిక వర్గం వల్ల ఆ మెజారిటీ భారీగా తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘119 స్థానాల్లో తమ సామాజిక వర్గానికి ఒక్కటంటే ఒక్క సీటు కేటాయించలేదంటూ’ ముదిరాజ్‌లు బీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారు. అందుకే కారు పార్టీకి ఈసారి దూరంగా ఉండాలంటూ వారు తీర్మానాలు చేస్తున్నారు. ఇదే జరిగితే సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ల మెజారిటీ కచ్చితంగా తగ్గే అవకాశాలున్నాయి. ఎందుకంటే ముదిరాజ్‌ సామాజిక తరగతి ఓట్లు గజ్వేల్‌లో 60 వేలు, సిద్ధిపేటలో 45 వేలు, సిరిసిల్లలో 40 వేలు, కామారెడ్డిలో 30 వేల దాకా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.
ఈ అంశాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ముదిరాజ్‌ల ఓట్లతోపాటు గజ్వేల్‌లో బీజేపీ నుంచి పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్‌ రూపంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఆ సామాజిక తరగతి దూరమవుతున్న విషయాన్ని గమనించి నష్ట నివారణా చర్యలను చేపట్టింది. అందులో భాగంగా ఓ ప్రయివేటు ఛానెల్‌లో బిత్తిరి సత్తిగా అందరికీ సుపరిచితుడైన చేవెళ్ల రవికుమాన్‌ను పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయన్ను గురువారం ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌… సత్తితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే ఆ పార్టీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. సత్తితో పాటలు రాయించటం, పాడించటం, బహిరంగ సభల్లో మాట్లాడించటం ద్వారా ఆ సామాజిక తరగతిని ఆకట్టుకోవాలన్నది గులాబీ పెద్దల వ్యూహంగా కనబడుతున్నది. ఇక్కడ ఈటల రాజేందర్‌, బిత్తిరి సత్తి సామాజిక వర్గం ఒక్కటే కావటం విశేషం. అయితే ఇదే సత్తి… కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ముదిరాజ్‌ మహాగర్జన సభలో బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించటం గమనార్హం.
మరోవైపు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అనే మీమాంసలో ఉన్న తెలంగాణ టీడీపీ బలహీనతను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ను గులాబీ గూటికి రప్పించటం ద్వారా… దూరమైన ఆ సామాజిక వర్గాన్ని దగ్గరకు తెచ్చుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కాసానితో కేసీఆర్‌ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద చంద్రబాబుతో భేటీ కానున్న జ్ఞానేశ్వర్‌… ఆయన చెప్పేదాన్నిబట్టి తుది నిర్ణయం తీసుకుంటారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశిస్తే… కాసాని టీడీపీలోనే ఉంటారు, ఒకవేళ వద్దని అంటే మాత్రం కచ్చితంగా కారెక్కుతారు…’ అని ఆయా వర్గాలు వివరించాయి. కాగా తెలంగాణ టీడీపీ వర్గాలు మాత్రం ‘అదంతా అసత్య ప్రచారం…’ అని కొట్టి పారేశాయి. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మామిళ్ల రాజేందర్‌, అంబర్‌పేట శంకర్‌ తదితరులను పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా ముదిరాజ్‌ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌… తాజాగా మత్స్య అభివృద్ధి ఫెడరేషన్‌ ప్రతినిధులతోనూ, దాని చైర్మెన్‌ పిట్టల రవీందర్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపింది. దాంతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌ సారధ్యంలో ఆయా తరగతుల ప్రతినిధులతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంతనాలు కొనసాగించారు. ఇవన్నీ ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో చూడాలి.