అందర్నీ అలరించే ఆపరేషన్‌ రావణ్‌

Operation Raavan‘పలాస, నరకాసుర’ వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్‌ అట్లూరి నటించిన కొత్త సినిమా ‘ఆపరేషన్‌ రావణ్‌’. ఈ సినిమాలో రాధిక శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కించారు. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను దర్శకుడు మారుతి అతిథిగా ఘనంగా నిర్వహించారు. దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ, ‘నేను, మా రక్షిత్‌ మూవీ కెరీర్‌లోకి రావడానికి మారుతి కారణం. మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో థ్రిల్లర్‌ అనే ట్యాగ్‌లైన్స్‌తో ప్రమోషన్‌ చేస్తున్నాం గానీ మా సినిమాలో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది. ప్రేమ సెన్సిబిలిటీస్‌ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమ ఇవ్వడం అనేది ఒకరకంగా ఉంటుంది. ప్రేమ అంతా నాకే కావాలని అనుకున్నప్పుడు మరో రకంగా ఉంటుంది. ఎంత డీప్‌ ప్రేమ, ఎంత వయలెంట్‌గా మారింది అనేది ఈ సినిమాలో తెరకెక్కించాం’ అని తెలిపారు. ‘ఈ సినిమాను మా నాన్న ఎంతో బాగా డైరెక్ట్‌ చేశారు. ఆయన ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌ అని సినిమా చూశాక ఎవరూ అనుకోరు. అంత బాగుంటుంది. నా ఫ్రెండ్‌ తిరువీర్‌. మేము కలిసి పలాసలో చేశాం. రాధిక పర్‌ఫార్మెన్స్‌ చూస్తే మీరు ఎంతో ఎమోషనల్‌ అవుతారు. మాస్క్‌ మ్యాన్‌ ఎవరో కనిపెట్టి మాకు చెబితే, సిల్వర్‌ కాయిన్‌ ఇస్తామని చెప్పాం. సినిమాకు మంచి హైప్‌ ఏర్పడింది. తప్పకుండా థియేటర్స్‌లోనే మా సినిమాని చూడండి. థ్రిల్‌ ఫీలవుతారు’ అని హీరో రక్షిత్‌ అట్లూరి చెప్పారు.
నేను ఆరు నెలల కిందట ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి వెంకట సత్య థ్రిల్లర్‌ సినిమాను రూపొందించడం మామూలు విషయం కాదు. ‘లండన్‌ బాబులు’ మూవీతో మెల్లిగా మొదలైన రక్షిత్‌ జర్నీ ‘పలాస’తో పీక్స్‌కు వెళ్లింది. ఈ సినిమాతో రక్షిత్‌ మరింత మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ మాస్క్‌ మ్యాన్‌ ఎవరు అనే క్యూరియాసిటీని బాగా హైప్‌ చేయటం విశేషం. ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది.
– దర్శకుడు మారుతి