రక్షిత్ అట్లూరి హీరోగా, రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘ఆపరేషన్ రావణ్’. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట సత్య సోమవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. మన ఆలోచన గురించి మనం తెలుసుకోవడమే మోక్షమని చెబుతుంటారు. సాధారణంగా సినిమాల్లో విలన్లు కబ్జా, డ్రగ్స్ అమ్మకం వంటి తప్పుడు పనులు, దౌర్జన్యం చేస్తుంటారు. ఇవన్నీ ఆ విలన్ల యాక్టివిటీస్. కానీ మేము ఆ పనులకు కారణమైన ఆలోచనలను విజువల్‌గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసినా, ఒప్పు చేసినా దానికి ఆ ఆలోచనే కారణం. మనం ఏ పనిచేసినా ఆ పనికి ముందు ఆలోచనల్లో చేద్దామా వద్దా అనే సంఘర్షణ జరుగుతుంది. అలాంటి ఆలోచనలకు తెర రూపమివ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా రూపొందించాను. ఈ సినిమాకి రామాయణం స్ఫూర్తి. అలాగే ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. మా అబ్బాయి రక్షిత్‌ను డైరెక్ట్ చేస్తున్నాననే విషయం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. అయితే ఫైట్స్ సీన్స్ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను. మా చిత్రంలో రాధిక కీలక పాత్ర పోషించారు. ఆమె చాలా అద్భుతంగానటించారు. మా సినిమా ప్రారంభమైన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం. అలా వెయ్యి మందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం’.