– అర్హత ఉన్న అందని జీరో విద్యుత్ బిల్లు…
– ప్రజాపాలన దరఖాస్తులు ఆన్‌లైన్ చేయడంలో తప్పులు..ప్రజాపాలన సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న లబ్దిదారులు..
– ఎడిట్ ఆప్షన్ లేక ఏమి చేయలేక పోతున్న అధికారులు..సేవా కేంద్రాల్లో కేవలం సర్వీస్ నెంబర్ల సవరణ మాత్రమే..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఆపరేటర్ల తప్పిదాలతో గృహజ్యోతి పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఆన్‌లైన్ నమోదులో జరిగిన పొరపాటు వలన జిల్లాలో వందలాది మంది గృహజ్యోతి పథకం పొందలేకపోయారు.అన్నీ అర్హతలు ఉన్న జీరో విద్యుత్ బిల్లుకు బదులు వందల రూపాయల బిల్లులు చేతికి అందడంతో అయోమయానికి లబ్ధిదారులు గురయ్యారు. ఇదేంటని విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే మరోసారి అప్లై చేసుకోవాలని సమాధానం చెబుతున్నారు.దీంతో లబ్ధిదారులు జీరాక్స్ పేపర్లతో ప్రజాపాలన సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.కానీ సేవా కేంద్రాలలో ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో మేము ఏమి చేయలేమని ఆపరేటర్లు చెబుతున్నారు.వివిద కారణాలతో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోలేని వారి పరిస్థితి కూడా ఇలానే ఉంది.
జిల్లాలో 2,75,272 గృహజ్యోతి దరఖాస్తులు: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.జిల్లాలో 475 పంచాయతీలు, 5 మున్సిపాలిటీలలోని 141 వార్డుల లో గ్రామసభలు నిర్వహించి అభయహస్తం పేరున అర్హులైన వారి నుంచి దరకాస్తులు సేకరించారు. ఇందులో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కోసం జిల్లాలో 2,75,272 మంది దరఖాస్తులు చేసుకున్నారు.అలా వచ్చిన దరకాస్తులను ఆపరేటర్లను నియమించి ఆన్‌లైన్లో పొందపర్చారు.
పథకానికి దూరమైన అర్హులైన లబ్ధిదారులు: మార్చి నుంచి గృహజ్యోతి అథకం అమలులోకి రాగా ఈ నెల ఒకటో తారీకు నుంచి విద్యుత్ సిబ్బంది కరెంట్ బిల్లులను ప్రజలకు అందజేస్తున్నారు. అయితే గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు చేసుకున్న చాలా మంది 200 యూనిట్లలోపే విద్యుత్ వాడుతూన్నప్పటికీ జీరో బిల్లులు మాత్రం రావడం లేదు.జిల్లాలో 2,75,272 మంది గృహజ్యోతికి దరఖాస్తూ చేసుకుంటే కేవలం 1.45 లక్షల మంది మాత్రమే అర్హులని అధికారులు అంటున్నారు.దీంతో జీరో బిల్లు అని చెప్పి వందల రూపాయల బిల్లు చేతిలో పెట్టడంతో అయోమయంలో లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే విద్యుత్ బిల్లుల అందజేయగా,ఇందులో 25 నుంచి 30 శాతం మంది ఉచిత విద్యుత్‌కు అర్హులైనప్పటికీ జీరో బిల్లుకు దూరం అయ్యారు.దీంతో తాము దరకాస్తులు చేసుకున్నప్పటికి ఎందుకు జీరో బిల్లులు ఇవ్వడం లేదని విద్యుత్ సిబ్బందిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ నమోదులో తప్పులు: గ్రామపంచాయతీలు,మున్సిపాలిటీల్లో తీసుకున్న ప్రజాపాలన దరకాస్తులను ప్రైవేట్ ఆపరేటర్లను నియమించి వారి ద్వారా ఆన్‌లైన్ చేశారు.ఇందులో చాలా మంది కి సరైన అనుభవం లేకపోవడంతో దరఖాస్తుదారుల పేర్లు,మీటర్ నెంబర్,తెల్లరేషన్‌కార్డు,ఆధార్ నంబర్లను తప్పుగా ఎంటర్ చేశారు.అలాగే ఒక్కో గ్రామంలో,వీధిలో ఒక్కో విధంగా ప్రజాపాలన దరఖాస్తూకు నెంబర్లను ఇవ్వడం జరిగింది.ఈ దరఖాస్తులు నేరుగా విద్యుత్ సంస్థల చేతికి వెళ్లడంతో వారు కూడా తప్పులను సరిచేయకుండానే నమోదు చేశారు.దీంతో చాలా మంది అర్హులైన లబ్ధిదారులు ఆపరేటర్లు చేసిన తప్పిదానికి గృహజ్యోతి పథకానికి దూరంఅయ్యారు.
మండల,మున్సిపాలిటీలలో ప్రభుత్వ సేవా కేంద్రాలు ఏర్పాటు: ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించి ప్రతీ మండలం, మున్సిపాలిటీలలో ప్రభుత్వ సేవా కేంద్రాలను ఓపెన్ చేసింది.మండలలో అయితే ఎంపీడీవో కార్యాలయం, మున్సిపాలిటీలో ఈ సెంటర్లను ప్రారంబించారు.ఒక్కో కార్యాలయంలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లకు బాధ్యతలు అప్పచెప్పారు.ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న చాలా మంది లబ్ధిదారులకు జీరో బిల్లు రాకపోవడంతో పదిహేను రోజులుగా వందలాది మంది ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.అయితే సేవా కేంద్రాలలో గతంలో చేసుకున్న దరఖాస్తులో విద్యుత్ సర్వీస్( మీటర్ నెంబర్), ఆదార్ నెంబర్, రేషన్‌కార్డు నెంబర్ తప్పుగా పడితే సరిచేసే అవకాశం ఇచ్చారు.కాని గతంలో కొన్ని కారణాలతో 200 యూనిట్లకు దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నవారు, లేక ఆపరేటర్ల తప్పుతో సర్వీస్ నెంబర్, లేదు అని నమోదు చేసిన వారికి సరిదిద్దె ఆప్షన్ ఇవ్వలేదు.ఒకవేళ కొత్తగా అప్లికేషన్ నమోదు చేయడానికి ప్రయత్నిస్తే ఆధార్, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్ ఆధారంగా గతంలోనే ఎంటర్ చేసినట్లు చూపిస్తుంది.దీంతో గతంలో ఆపరేటర్ల తప్పిదంతో గృహజ్యోతి పథకంలో నమోదు కాని వారికి,ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకొని,గృహజ్యోతికి నమోదు చేయని వారికి సరిదిద్దె ఆప్షన్ లేకపోవడంతో అర్హత కలిగిఉన్న దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. అర్హత ఉండి దరఖాస్తులు చేసుకునేలా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని ప్రజలు,లబ్ధిదారులు కోరుతున్నారు.