“రైతు భరోసా” పై అభిప్రాయ సేకరణ

– పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ 
– రైతులతో అత్యవసర సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ – తాడ్వాయి 
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండలంలోని రైతులతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఏడిఏ ఏటూర్ నాగారం ఎన్ శ్రీధర్, స్థానిక తాసిల్దార్ రవీందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక జై సింగ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుల నుంచి రైతు భరోసా కు సంబంధించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. కొందరు రైతులు మాట్లాడుతూ.. 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, గ్రామాల్లో వెంచర్లు చేసిన వాటికి, ఎకరాలకు ఎకరాలు పడావుగా ఖాళీ గా ఉన్న భూములకు రైతు భరోసా సాయం అందించవద్దని సూచించారు. రైతు పులి నరసయ్య గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు బోనస్ ఇవ్వాలని అన్నారు. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ మాట్లాడుతూ భారాస హయాంలో బంజరు భూములకు గుట్టలకు, రాళ్లు రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వేసిన స్థలాలకు, జాతీయ రహదారులకు ఇచ్చిన భూములకు పథకం నిధులను ఇచ్చి రూ.26,500 కోట్లు ప్రజాధనాన్ని దుబారా చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం “రైతు భరోసా” అని ఆదర్శవంతమైన పథకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. సలహాలు సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, ఏడిఏ శ్రీధర్, మండల వ్యవసాయ శాఖ అధికారి జై సింగ్, పిఎసిఎస్ సంఘ కార్యదర్శి స్వాతి, పిఎసిఎస్ డైరెక్టర్ యానాల సిద్ది రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.