– బీజేపీలో ఉంటే నీతిపరులు..
– లేదంటే అవినీతిపరులా ?
– భువనగిరిలో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాదులను ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని కోరారు. ఎండి. జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ సీపీఐ(ఎం) మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని గట్టు శ్రీరాములు ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, బండ శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. దేశంలో పదేండ్ల నరేంద్రమోడీ పాలనలో ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించారని చెప్పారు. ధరల మీద ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వరంగ కంపెనీలను కారుచౌకగా కార్పొరేట్లకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అమలు చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా ముద్ర వేస్తూ.. ప్రతిపక్ష పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందన్నారు. బీజేపీలో ఉన్నంత అవినీతిపరులు మరే పార్టీలో లేరని చెప్పారు. బీజేపీలోకి పోతే నీతిపరులవుతారు.. లేకుంటే అవినీతిపరులా అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయాలని వస్తే ఊరి బయటి నుండే వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు.
భువనగిరి పార్లమెంట్ స్థానంలో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రతి కార్యకర్త పార్టీ ప్రతిష్టను పెంచేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. జహంగీర్‌కు అత్యధికంగా ఓట్లు వేయించి నైతిక విజయం సాధించాలన్నారు. అమరవీరుల ఫొటోల సాక్షిగా కమ్యూనిస్టుల ఓట్లు కమ్యూనిస్టులకే వేసుకుందామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భువనగిరి కమ్యూనిస్టుల ఉద్యమాలకు పుట్టినిల్లు :సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి.జహంగీర్
భువనగిరి కమ్యూనిస్టు ఉద్యమాలకు పుట్టినిల్లు అని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్ అన్నారు. ఈ ప్రాంతంలో ఏ చెట్టును, ఏ గుట్టను కదిలించినా దానికో పోరాట చరిత్ర ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో ఎర్రజెండా కనబడుతుందని చెప్పారు. మునుగోడులో కందాల రంగారెడ్డి, నకిరేకల్‌లో నర్రా రాఘవరెడ్డి, తుంగతుర్తిలో భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, జనగామలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి, ఆలేరులో ఆరుట్ల రామచంద్రారెడ్డి, సుశీల, దుంపల మల్లారెడ్డి, భువనగిరిలో రావి నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నంలో కొండిగాని రాములు, ముస్కు నర్సింహా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారన్నారు. మహోన్నతులను కన్న ఈ నేలపై సీపీఐ(ఎం) పోటీ చేస్తుందన్నారు. తనను గెలిపిస్తే సాగునీటి కోసం పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం, బస్వాపురం, గంధమల్ల, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసే విధంగా పనిచేస్తానన్నారు. విద్య, వైద్యం సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడుతానన్నారు. కమ్యూనిస్టులది ఉద్యమ చరిత్ర అన్నారు. మిగతా పార్టీలది బతుకు చరిత్ర అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్, బట్టుపల్లి అనురాధ, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి, నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, చౌటుప్పల్ మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా పాల్గొన్నారు.