– ‘క్రికెట్ ఫస్ట్’ హెచ్‌సీఏ ప్యానల్ హామీ
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) జట్లలో స్థానిక క్రికెటర్లకు మాత్రమే అవకాశాలు కల్పిస్తామని, స్థానికేతరులు హెచ్‌సీఏ తరఫున బరిలోకి దిగే సంస్కృతికి చరమగీతం పాడుతామని ‘క్రికెట్ ఫస్ట్’ హెచ్‌సీఏ పోల్ ప్యానల్ ప్రకటించింది. ‘జట్ల ఎంపికకు పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకుంటాం. తెలంగాణలో ఎస్‌ఎస్‌సీ చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తాం. ఇతరులు ఇక్కడ ఆడాలంటే కనీసం ఐదేండ్ల పాటు క్లబ్, జోనల్ క్రికెట్‌లో ఆడాలనే నిబంధనలు తీసుకొస్తామని’ హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తెలిపారు. ఈ నెల 20న జరుగనున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో ఆ ప్యానల్ నుంచి అధ్యక్షుడిగా అమర్‌నాథ్, ఉపాధ్యక్షుడిగా జి. శ్రీనివాస రావు, కార్యదర్శిగా ఆర్. దేవరాజ్, కోశాధికారిగా సి. సంజీవరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా చిట్టి శ్రీధర్, కౌన్సిలర్‌గా సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేషు నారాయణ సహా ఇతర క్రికెటర్లు ఈ ప్యానల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.