– కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటనను ఖండిస్తున్నాం : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖనిజాల అన్వేషణలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. మంగళవారం ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఖనిజ సంపదకు లోటు లేదనీ, అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నందు వల్ల కార్పొరేట్, ప్రయివేటు విధానాలను శరవేగంగా అమలు చేస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగానికి అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నామని ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ పోతున్న మోడీ సర్కారు కన్ను ఇప్పుడు దేశ ఖనిజ సంపదపై పడిందనీ, దాన్నీ కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రయత్నాలను వేగతరం చేస్తున్నదని విమర్శించారు. ఖనిజ అన్వేషణను ప్రయివేటు రంగానికి కట్టబెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. దేశ ఖనిజ సంపద, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందనీ, ఐక్యఉద్యమాల్లో కార్మికులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.