ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రతిపక్షాల నిరసన ర్యాలీ

– మరో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు
– సీఈసీ, ఈసీల నియామక బిల్లు ఆమోదం
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ పర్వం గురువారమూ కొనసాగింది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై వేటు పడింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు దీపక్‌ బైజ్‌, డికె సురేశ్‌, నకుల్‌ నాథ్‌ పై స్పీకర్‌ ఓం బిర్లా వేటువేశారు. ఈ శీతాకాల సమావేశాల మొత్తానికి వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకూ లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 100కు చేరింది. అలాగే, ఉభయ సభల్లో కలిపి ఆ సంఖ్య 146గా ఉంది. మరోవైపు, లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయి దా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందుగానే లోక్‌సభ సమావేశాలను ముగించారు. తొలుత.. లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే.. పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై ఈ ముగ్గురు ఎంపీలు నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వారి సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మా నం చేయడంతో ఈ ముగ్గురు ఎంపీలపై వేటు పడింది.
ప్రతిపక్షాల నిరసన ర్యాలీ
ఈ మూకుమ్మడి సస్పెన్షన్లపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్‌ భవనం నుంచి సెంట్రల్‌ ఢిల్లీలోని విజరుచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాసిన బ్యానర్‌, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు హౌరెత్తించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ అధికార బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. ”భద్రతా వైఫల్యంపై చర్చించడానికి అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మెన్‌ను కోరుతున్నాం. ప్రధాని మోడీ, హౌం మంత్రి అమిత్‌ షా దీనిపై పార్లమెంట్‌లో ప్రకటన చేయాలి. ప్రధాని లోక్‌సభ మినహా బయట మీడియాతో, సభల్లో దీని గురించి మాట్లాడారు. భద్రతా వైఫల్యం ఘటన ఎందుకు జరిగింది..? ఎవరు బాధ్యులు..?” అని ఖర్గే ప్రశ్నించారు. ప్రతిపక్షాల’ఇండియా’ ఫోరం సభ్యులు శుక్రవారం జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టనున్నారని ఆయన చెప్పారు.
సీఈసీ, ఈసీ నియామకాల బిల్లు ఆమోదం
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. ‘ది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు- 2023’ను గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదించింది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. కొత్త బిల్లు ప్రకారం.. ఇక నుంచి సెర్చ్‌, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి. సీఈసీ, ఈసీల నియామక కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవని పేర్కొంటూ.. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. ప్రస్తుతమున్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలూ ఇందులో పొందుపర్చారు.