‘సామాజిక, ఆర్థిక భద్రతకు ఓపీఎస్‌’

OPS for social economic securityప్రజల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఓపీఎస్‌) విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. ఇప్పటికే వినతులు, నిరసనలు, ఉద్యమాల ద్వారా తమ గళం వినిపించిన ఉపాధ్యాయ లోకం సమస్యను మరింత గట్టిగా చెప్పడానికే ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన కేబినేట్‌ మీటింగ్‌లో ఓపీఎస్‌పై సానుకూల నిర్ణయం వస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.28లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా వారిలో రెండు లక్షల మంది సిపిఎస్‌ ఉద్యోగులున్నారు. నూతన ఉద్యోగ నియామకాల వల్ల ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1 సెప్టెంబర్‌ 2004 నుండి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, గ్రాండ్‌ ఇన్‌ ఎయిడ్‌ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగు లు, అటానమస్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సిపిఎస్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించు కుంటూ 23 ఆగస్టు 2014న జీఓను జారీ చేసింది. దీంతో 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సిపిఎస్‌ పరిధిలోకి నెట్టబడ్డారు. అందుకే సెప్టెంబర్‌1ని ఉపాధ్యాయ సంఘాలు పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తున్నాయి.
ఒక సిపిఎస్‌ ఉద్యోగి, ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వారికి వచ్చే పెన్షన్‌ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక భద్రతలేక వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్‌ పరిధిలోకి రావడం వల్ల రిటైర్‌మెంట్‌ సమయంలో వచ్చే 50శాతం పెన్షన్‌, కుటుంబ సభ్యులకు 30శాతం పెన్షన్‌, కనీసం రూ.16 లక్షల గ్రాట్యుటి, కమ్యూటేషన్‌ వంటి సౌకర్యాలను కోల్పోతున్నారు. పెన్షన్ల ఆర్థిక భారం ప్రభుత్వాలపై పడకుండా ఉండడానికి ఈ సీపీఎస్‌ని తీసుకువచ్చారు. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కాని ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతను విస్మరించారు. సిపిఎస్‌ కింద ఉద్యోగి తన బేసిక్‌ పేడిఏలలో కలిపి 10శాతం, మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ప్రభుత్వం నుంచి మరో 10శాతం సొమ్మును కలిపి నేషనల్‌ పెన్షన్‌ స్కీం ట్రస్ట్‌(ఎన్‌పిఎస్‌టి)లో జమ చేస్తారు ఉద్యోగికి కేటాయించిన పర్మనెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(ప్రాన్‌)లో ఈ సొమ్ము జమవుతుంది. ఉద్యోగి పదవి విరమణ పొందే వరకి జమ అయిన మొత్తం నుంచి 60శాతం డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40శాతం డబ్బును భారతీయ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్‌ కింద రిటైర్డ్‌ ఉద్యోగికి చెల్లిస్తారు. ఒకవేళ షేర్‌ మార్కెట్లో నష్టాలను చవిచూస్తే ఉద్యోగి డబ్బుల నుంచి తీసుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డబ్బులు స్టాక్‌ మార్కెట్లో పెట్టి స్టాక్‌ మార్కెట్‌ లాభనష్టాలపై ఉద్యోగి పెన్షన్‌ ఇవ్వడం అనేది చాలా విచారకరం. వారి సొమ్ముకు ఆర్థిక భద్రత లేకుండా పోతుంది. అందుకే ఈ సిపిఎస్‌ విధానం నష్టదాయకంగా ఉందని దాన్ని రద్దుచేసి ఓపీఎస్‌ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి.
దేశంలోని రాజస్థాన్‌ ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, కర్నాటక రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్‌ను రద్దు చేశాయి. ఈ విధంగా కొన్ని రాష్ట్రాల్లో సిపిఎస్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. సిపిఎస్‌ని రద్దు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఏ) చట్టం ప్రకారం వీలు కల్పిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వారి ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం సిపిఎస్‌ని రద్దు చేయాలనుకుంటే చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిపిఎస్‌ ఉద్యోగుల కోసం జీఓ ఎంఎస్‌ నెంబర్‌58, 11జూన్‌ 2021 ప్రకారం ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు కుటుంబ పెన్షన్‌ చెల్లించబడుతుందని ఉత్తర్వులు జారీ చేశారు దీనిలో అప్పటి వరకు ఉద్యోగ జీతం నుండి మినహాయించబడిన సిపిఎస్‌ చందా మొత్తం ప్రభుత్వానికి సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి విధానాలున్న స్కీమ్‌ను తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల అభివృద్ధి, పాలనలో ప్రభుత్వానికి ఎంతో సహకరించే ఉద్యోగులపై మెడమీద కత్తి లాంటి సిపిఎస్‌ను అమలు చేయడం ఎంతమాత్రం సరికాదు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిపిఎస్‌ని రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
పాకాల శంకర్‌గౌడ్‌
9848377734