ఓపీఎస్‌తోనే ఉద్యోగులకు న్యాయం

ఓపీఎస్‌తోనే ఉద్యోగులకు న్యాయం–  వేతన సవరణ చేపట్టాలి : ఎల్‌ఐసీ ఉద్యోగ జేఏసీ మెరుపు సమ్మె
నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ
పాత పెన్షన్‌ విధానాల వల్ల ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని, ఎన్‌పీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ఎల్‌ఐసీ జేఏసీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట బుధవారం మెరుపు సమ్మె చేపట్టారు. ఉద్యోగుల, డీవోలు, ఆఫీసర్ల ఐక్యత వర్ధిల్లాలి… జేఏసీ వర్ధిల్లాలి… ఎన్పీఎస్‌ మాకొద్దు అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సక్కి సత్యనారాయణ, గంగోని శ్రీధర్‌, చంద్రశేఖర్‌ పవర్‌ మాట్లాడారు. తక్షణమే ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని, యాజమాన్యం కాలయాపన చేసే విధానాన్ని ఎండగడుతూ ఈ సమ్మె చేసినట్టు తెలిపారు. న్యూ పెన్షన్‌ స్కీమ్‌లో యాజమాన్యం వాటా 14 శాతానికి పెంచాలని, పాత పెన్షన్‌ విధానాల వల్ల ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎల్‌ఐసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి తక్షణమే నూతన రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో బ్రాంచ్‌ అధ్యక్షులు సక్కి ఆనంద్‌ కుమార్‌, కేపీ శివశంకర్‌, పీఎస్‌ సామ్రాట్‌, గంగాధర్‌, క్లాస్‌ 1 ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు కల్పన, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సంఘం నాయకులు గంగోని శ్రీధర్‌, ఏడీ శ్రీనివాస్‌, గోపాల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.