కొందరు అయినదానికి కాని దానికి ఒర్రుతనే ఉంటరు. యారండ్లు, అత్తకోడండ్లు లేకుంటే యజమాని పనివాల్ల మధ్య ఈ ఒర్రుడు ఉంటనే ఉంటది. ఆధిపత్య పైత్యం అట్ల కింది శ్రేణి వాల్ల మీద ఏదో వంక పెట్టి మాటలు రాలుస్తది. దీంతోనే లొల్లులు అయితయి. అప్పుడు ఊకే కయ్య కయ్య ఒర్లుతాంటే ‘ఒర్రెటోనికి ఊకున్నోడే మొగడు’ అనుకొని సప్పుడు చెయ్యక మౌనంగ వుంటరు. ఇక్కడ మగడు అనే మాట ఎట్ల పుట్టిందంటే భార్య మీద పెత్తనం చెలాయించేవాడు ఆధిపత్యం వహించి ఆమె మాటలను, చేతలను కంట్రోల్ చేసేవాడనే అర్ధంలో వాడుతరు. లొల్లిల ఒగలు ఒర్రుతుంటే ఇంకొకరు మాటకు మాట అంటే ఎక్కువ అయితది. సైలెన్స్‌గ వుండి దరిద్రపు వెదవ ఇట్లనే అంటడు, మనం వినిపించుకోకపోతే అయిపాయె అనుకుంటరు. అప్పుడు ఇది ‘నల్లికుట్లది చెయ్యాచేస్తది సప్పుడు చేస్తలేదు’ అని ఊరుకుంటరు. లేకుంటే అబ్బో వాడు ‘నంగనాచి తంగబుర్ర’ అని అంటుంటరు. కొందరు మొండివాల్లు ఉంటరు. మొండి అంటే ఎవరికీ విననివాల్లు అనే అర్ధంలో వాడుతున్నరు. నిజానికి ఇదొక కులం కూడా వున్నది. సామెతల్లో కులాలు కూడా వస్తయి. ఇవి పుట్టిన కాలంకు సంబంధించిన వ్యవహారంలా వుంటది. ఎవరికీ వినని వాల్లను మొండి, జగమొండి అంటరు. అంటే ‘మొండివాడు రాజుకంటే బలవంతుడు’ అనే సామెత ఉన్నది. అందరికంటే రాజే గొప్ప అంటే, రాజుకన్నా గొప్ప అనే వ్యంగ్య అర్ధంలో వాడుతరు. కొందరిని చూస్తే అమాయకత్వం కన్పిస్తది. ఏం తెల్వని వాల్ల లెక్క మొకం పెడుతరు. కాని అన్ని తెలుస్తయి. తెలవనట్లు వుంటరు. వాల్లను చూసి, వాడు ‘వేలు పెడితె కొరకడు వెన్న పెడితె నాకడు’ అంటరు. కమ్మని వెన్నమద్దను తెచ్చి ఇస్తె రుచి చూడని వారు ఎవరూ వుండరు. అమాయకుని లెక్కనే ఇంక కొందరు మోటు మనుషులు వుంటరు. మోటు వాల్లు అంటే శ్రమ జీవులు అన్నట్లు. మరికొందరు శాని మనషులు వుంటరు. వాల్ల వ్యవహారం అంతా శానత్తం లెక్క వుంటది. అయితే మోటు వాల్లకు పనే ప్రపంచం. ‘మోటువానికేం తెల్సు మొగిలిపూల వాసన’ అంటరు. నిత్యం చెమట పరిమళం చూసే వాల్లకు నిజంగానే మొగిలిపూల వాసన తెలిసే అవకాశం లేదు.
– అన్నవరం దేవేందర్, 9440763479