ముసునూరి కాపయ్య – భారతమాత పాదపద్మాలకు ఈ పుస్తకం అంకితం చేశారు రచయిత. స్థపతి ఈమని శివనాగిరెడ్డి, కోగంటి చెన్ను గాంధీబాబు, ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, వి.వి.సుబ్రహ్మణ్యం, గొట్టిపాటి సత్యవాణి గార్లు చక్కటి ముందుమాటలు రాశారు. తెలుగువారు స్మరించుకోవాల్సిన గొప్ప రాజుల్లో ఒకరు ముసునూరి కాపయ్య నాయుడు. తురుష్కుల దండయాత్రల్లో అల్లకల్లోలం అయిన అలనాటి త్రిలింగదేశాన్ని రక్షించిన మహావీరుడు కాపయ్య. ఓరుగల్లు కోటపై ముసునూరి జెండా ఎగరేసిన గొప్ప యోధుడు కాపయ్య నాయకుడు. ముసునూరి ప్రోలయ్య, కాపయ్య నాయకులను తెలుసుకోవాలి ఈ తరం వారు. కమ్మవారి చరిత్రను గ్రంథస్థం చేసిన అమర్‌నాథ్ కృషి ప్రశంసనీయం. తెలంగాణ ప్రాంతంలోని అత్యధిక భూభాగం మాత్రం ఢిల్లీ సుల్తాన్‌ల ఆధీనంలోనే ఉన్న సమయంలో ప్రోలయ్య నాయకుని తమ్ముడు అయిన ముసునూరి కాపయ్య నాయకుడు సుల్తాన్‌పూర్‌ను జయించి దాని ప్రతినిధియైన మానిక్ మక్భూల్‌ను తెలంగాణ ప్రాంతం నుండి తరిమికొట్టాడు. కాపయ్య నాయకుడు సుల్తాన్‌పూర్ పేరును ఓరుగల్లుగా మార్చాడు. 1945లో మల్లంపల్లి సోమశేఖరశర్మ ముసునూరి నాయకుల పుస్తకం, 2009 నాటి తుమ్మల వెంకటేశ్వరరావు రచించిన ‘ముసునూరు ప్రభువులు’ (ప్రోలయ్య – కాపయ్య) పుస్తకాలు అత్యంత ప్రామాణికమైనవి. 14 శాసనాలను సేకరించి శోధించి అమర్‌నాథ్ రాశారు ఈ పుస్తకం. కాపయ్య ముసునూరి దేవయ్య నాయకుని పెద్ద కుమారుడు. ఇతను వేంగి ప్రభువు అయిన ముసునూరి పోచయ్య నాయకుని సర్వ సైన్యాధ్యక్షుడు. 1287 ఏప్రిల్ 19 కాపయ్య జన్మించాడు. కాకతీయ ప్రతాపరుద్రుని సామంతునిగా పరిపాలన చేస్తున్ననాటి కమ్మ ప్రభువు గురిజాల కూనయ్య చిన్న కుమార్తె గిరిజతో 1307 అక్టోబర్ 22 న వివాహం జరిగింది. 1343లో కాపయ్య ఓరుగల్లు పై ముసునూరి రాజ్యం జెండా ఎగురవేశాడు. 1369లో రాచకొండ రేచర్ల వారి చేతిలో ముసునూరి పాలకులు ఓడిపోవడం… ఇలా ఎన్నో అంశాలు శాసనాల ద్వారా ఎంతో ప్రామాణికతతో ఈ పుస్తకం రాశారు. ఓరుగల్లు కమ్మ ప్రభువు కాపయ్య చరిత్ర పరిశోధకులకు చరిత్ర అధ్యయనకారులకు చక్కటి కరదీపిక.
– తంగిరాల చక్రవర్తి, 9393804472.
ముసునూరి కాపయ్య
రచన : యడ్లపల్లి అమర్‌నాథ్
పేజీలు : 160, వెల : 250/-
ప్రతులకు: ముసునూరి రామకృష్ణ ప్రసాద్
డైరెక్టర్, మాక్రోమీడియా డిజిటల్ ఇమేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, డి.ఐ.డి.ఎ., ఫేస్ – 2, చర్లపల్లి, హైదరాబాద్. సెల్ : 9849556789. నవోదయ బుక్ హౌస్, కాచిగూడ. హైదరాబాద్ – 24652387.