నలుగురు మహిళలకు ఆస్కార్‌ నామినేషన్లు

నలుగురు మహిళలకు ఆస్కార్‌ నామినేషన్లుమన చుట్టూ ఉన్న మనుష్యులలో ఎంతమంది నిజంగా మనపై ప్రేమతో ఉన్నారన్నది మనం ఎప్పుడన్నా ఆలోచిస్తే నూటికి తొంభై తొమ్మిది అవసరార్ధ స్నేహాలే కనిపిస్తాయి. కొంతమంది తమ అవసరాల కోసమే మనతో ఉన్నారని మనకు తెలుసు, మనకు అది తెలుసని వారికీ తెలుసు. కాని పైకి ఎంతో ప్రేమాభిమానాలు వాళ్లు అందిస్తూ ఉంటారు. అన్నీ తెలిసి మనం వాటిని స్వీకరిస్తూ ఉంటాం.
కొన్ని బంధాలలో నిజాలు తెలిసినా అవి నిజాలని ఒప్పించలేని స్థితిలో తెలివిగా మనుష్యులు మనలను ఇరుకున పెట్టేయడంతో అన్నీ తెలిసి వారి చేతిలో నిస్సహాయంగా మోసానికి గురవుతూ ఉంటాం. ఎంతో తెలివితో మనలను బంధించి తమ జీవితాలను మనపై నిర్మించుకుని వెళ్ళిపోతారు కొందరు. వారికి నిచ్చెనగా మారడానికి ఇష్ట పడకపోయినా, ఇరుక్కుపోయి వాళ్ల ఉన్నతికి మనల్ని వాడుకుంటున్నారని తెలిసినా నిస్సహాయంగా దోపిడీకి గురయ్యే మనుషులు ఎందరో. అలాంటి ఇద్దరు మిత్రుల కథ 1950లో వచ్చిన ‘ఆల్‌ అబౌట్‌ ఈవ్‌’. 1946లో ‘థి విస్డం ఆఫ్‌ ఈవ్‌”అనే పేరుతో మేరి.ఆర్‌ రాసిన ఓ చిన్న కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. హాలీవుడ్‌ చిత్రాలలో ఆస్కార్‌ పొందిన చిత్రాలన్నిటి మధ్య అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు.
ఈ చిత్రంలో థియేటర్‌ ఆర్టిస్ట్‌ మార్గో చాన్నింగ్‌ గా బెట్టీ డేవిస్‌ నటన చూసి తీరవలసిందే. ఆమెతో పోటీగా నటించింది ఈవ్‌ పాత్ర పోషించిన ఆన్నె బాక్స్‌టర్‌. నలభైలలోకి వచ్చిన ప్రఖ్యాత రంగస్థల నటి మార్గో. ఈమె ప్రాణ స్నేహితురాలు కారెన్‌ రిచర్డ్స్‌. కారెన్‌ భర్త రిచర్డ్‌ మార్గో నటించే నాటకాలకు రచయిత. బిల్‌ ఆ నాటకాల దర్శకుడు. ప్రజలలో మార్గోకి గొప్ప ఆదరణ ఉంది. ఆమె చాలా గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది. తన కన్నా ఎనిమిదేళ్ళు చిన్నవాడయిన బిల్‌ని ఆమె ప్రేమిస్తుంది. ఈ నలుగురు మిత్రులు ఆనందంగా జీవిస్తుంటారు. వారి మధ్యకు వస్తుంది ఈవ్‌. మార్గోని పిచ్చిగా అభిమానించే యువతిగా ఆమె కారెన్‌ కు పరిచయమవుతుంది. ప్రతి రోజు ఒకే నాటక ప్రదర్శనలను నిలబడి చూసే ఈవ్‌ కారెన్‌ ని ఆకర్షిస్తుంది. మార్గోకి ఆమె వీరాభిమాని అని తెలుసుకుని ఆమెను మార్గోకి పరిచయం చేస్తుంది. మార్గోతో ఈవ్‌ తాను ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకున్న ఓ సైనికుని భార్యనని, యుద్ధంలో భర్త మరణిస్తే, బతుకు తెరువు కోసం ఈ నగరానికి వచ్చానని, కడు పేదరికంలో జీవిస్తున్నానని, తన జీవితంలో ఆనందం మార్గో ప్రదర్శనలే అని చెప్పుకుంటుంది. ఆమె విషాద కథ అందరినీ కదిలిస్తుంది. మార్గో ఈవ్‌ని తన దగ్గరే ఉండిపొమ్మని అడుగుతుంది.
వచ్చిన రోజు నుండి ఈవ్‌, మార్గోకి ప్రతి పనిలో తోడుగా నిలబడుతుంది. అంతకు ముందు ఇతర నౌకర్లు, మిత్రులు చేసే పనులు కూడా తానే పూనుకుని చేస్తుంది. ఇది కొందరికి ఇబ్బంది కలిగించినా ఈవ్‌ మదు స్వభావం, మార్గోపై ఉన్న పిచ్చి భక్తి చూసి అందరూ ఆమెను ప్రేమించడం మొదలెడతారు. కారెన్‌ ఈవ్‌ ను పూర్తిగా నమ్ముతుంది. ఎంతో ప్రేమిస్తుంది. మార్గో బిల్‌ని పిచ్చిగా ప్రేమిస్తుంది. కాని తమ మధ్య ఉన్న వయసు తేడా, ఆమెలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. పైగా తాను ఎన్నో రోజులు రంగస్థలం మీద ఇక ఉండలేనని ఆమె మనసు చెపుతూ ఉంటుంది. బిల్‌ తనను ప్రేమిస్తున్నాడా, తనలోని నటినా అన్నది ఆమెకు అర్ధం కాదు. ఒక పదేళ్ళలో తనలోని నటి చనిపోతుందని, తాను మాత్రమే మిగులుతానని అప్పుడు బిల్‌ ఇలాగే తనతో ఉంటాడా అన్న అనుమానం ఆమెను నిత్యం వేధిస్తూ ఉంటుంది.
బిల్‌ ఏదో పని మీద పొరుగు రాష్ట్రం వెళతాడు. అతని పుట్టిన రోజు నాడు తానే పూనుకుని అతనికి ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేస్తుంది ఈవ్‌. మార్గో బిల్‌తో అర్ధరాత్రి మాట్లాడుతూ, ఈవ్‌ చూపిన ఈ చొరవకు ఆలోచనలో పడుతుంది. తాను బిల్‌ పుట్టినరోజును మర్చిపోయానని తనకు, బిల్‌కు కూడా గుర్తు చేసిన ఈవ్‌ ప్రవర్తన పట్ల ఆమెలో అనుమానం మొదలవుతుంది. పైగా ఈవ్‌ ప్రత్యేకంగా బిల్‌కు శుభాకాంక్షలు పంపడం ఆమెకు నచ్చదు. మార్గో ప్రదర్శనల తరువాత ఆమె దుస్తులను తన ఒంటిపై వేసుకుని ఆమెలా నటించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈవ్‌. ఇది మార్గో దష్టికి వచ్చినా దానిని చిన్నపిల్ల చర్యగా కొట్టిపడేస్తుంది మార్గో. కాని క్రమంగా ఈవ్‌ అతి చనువు, అతి మంచితనం ఆమెకు ఇబ్బందిగా మారతాయి. ఈవ్‌పై ఆమె చూపిస్తున్న ఆకారణ ద్వేషం, బిల్‌, కారెన్‌ లకు కోపాన్ని తెప్పిస్తుంది. ఇది మార్గోలో ఇంకా అసహనాన్ని పెంచుతుంది. అందుకని ఈవ్‌ను వదిలించుకోవాలని, తెలిసిన ఓ నిర్మాతను ఈవ్‌ని పనిలో పెట్టుకొమ్మని అడుగుతుంది మార్గో. కాని ఈ లోపే ఈవ్‌ మార్గో అండర్‌ స్టడీగా నిర్మాతలను పరిచయం చేసుకుంటుంది. మార్గోకు ఈ విషయం తెలియదు. అండర్‌ స్టడీ అంటే ప్రతి రోజు చేసే ప్రదర్శనలలో ఏ రోజయినా నటి రాలేకపోతే ఆమె బదులు మరొకరు ఆ పాత్రను పోషించడానికి తయారుగా ఉంటారు. వాళ్ళు ఆ పాత్ర డైలాగులు, సంబంధిత నటన నేర్చుకుని ఉంటారు. అలా మార్గోకు అండర్‌ స్టడీగా తనను తాను నిర్మాతలకు పరిచయం చేసుకున్న ఈవ్‌, ఓ కొత్త పాత్ర ఆడిషన్‌కు మార్గో ఆలస్యంగా వెళ్లడంతో తానే ఆ డైలాగులు చెప్పి ఆ పాత్రను సంపాదించుకుంటుంది. ఇది తెలిసి మార్గో కోపంతో రెచ్చిపోతుంది. తన ప్రియడు బిల్‌ కూడా ఈవ్‌ను మెచ్చుకోవడం స్నేహితుడు రిచర్డ్‌ ఆమెను ఆ పాత్రకు సరిపోయిందనడంతో ఆమె కోపం పెరిగిపోతుంది. బిల్‌ తోనూ రిచర్డ్‌ తోనూ గొడవపడుతుంది. బిల్‌ మార్గోలోని ఈ అభద్రతాభావాన్ని అర్ధం చేసుకుంటాడు. ఆమె పట్ల తన ప్రేమ నిజమైనదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని మార్గోలోని అశాంతి దూరం కాదు.
మార్గో ఈవ్‌ పై అకారణంగా కోపం పెంచుకుంటుందని, ఇది అన్యాయమని కారెన్‌ నమ్ముతుంది. ఈ తప్పు సరిదిద్ది ఈవ్‌కు కొంచెం ఆనందం ఇవ్వాలని అనుకుంటుంది. ఒక వారాంతం సెలవులకు కారెన్‌, రిచర్డ్‌, మార్గో ఊరు బైటకు షికారుకు వెళతారు. మరుసటి రోజు మార్గో నాటక ప్రదర్శనకు హాజరు కావాలి. కాని తాము ప్రయాణిస్తున్న కారు పని చేయకుండా చేసి మార్గో ప్రదర్శనకు సమయానికి వెళ్లలేని పరిస్థితులను కారెన్‌ కల్పిస్తుంది. దీనితో ఆ రోజు మార్గో బదులు ఈవ్‌ ఆ పాత్రను పోషిస్తుంది. కానీ ఆ రోజు కారులో ఇద్దరు స్నేహితురాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటున్నప్పుడు కారెన్‌కు ఈవ్‌ పట్ల మార్గో కున్న కోపంలో కారణాలు కనిపిస్తాయి. తాను ఈవ్‌కు అవకాశం కల్పించి తప్పు చేశానని ఆమెకు అర్ధం అవుతుంది. అక్కడ ఈవ్‌ తన ప్రదర్శనకు ప్రఖ్యాత రిపోర్టర్‌ ఆడిసన్‌ వచ్చేలా చూస్తుంది. అతనితో మార్గోకు విరుద్దంగా రివ్యూ రాయించుకుంటుంది. దీనితో మార్గో పట్ల విముఖత ఈవ్‌ పట్ల ఆరాధన ప్రజలలో పెరుగుతుంది. ఈవ్‌ ఇదే అదనుగా చేసుకుని బిల్‌ని ఆకర్షించి తన వలలో వేసుకోవాలని చూస్తుంది. బిల్‌ ఆమెలోని స్వార్ధాన్ని గుర్తుపట్టి ఆమెను చీత్కరించి మార్గో దగ్గరకు వస్తాడు. కారెన్‌, రిచర్డ్స్‌, బిల్‌ ముగ్గురూ మార్గో కష్టసమయంలో ఆమెకు తోడుగా నిలబడతారు.
ఆడిసన్‌ స్వార్ధపరుడు, అందమైన నటీమణులను హాలివుడ్‌ పేరుతో ఉపయోగించుకునే దుర్మార్గుడు. కాని తలచుకుంటే వారి తలరాతలనూ మార్చగల ఘటికుడు. ఇది తెలిసి ఆడిసన్‌తో స్నేహం మొదలుపెడుతుంది ఈవ్‌. కాని ఆ రివ్యూ వెనకాల తనదేమీ తప్పు లేదని రిచర్డ్‌ దగ్గర అమాయకంగా నటిస్తుంది. బిల్‌, మార్గో, కారెన్‌ ఆమె అసలు గుణం అర్ధం అయి ఆమెకు దూరం అవుతారు. మార్గో, బిల్‌ వివాహం చేసుకోడానికి నిశ్చయించుకుంటారు. నలుగురు ఆనందంగా భోంచేస్తున్న హోటల్‌కు ఈవ్‌ కూడా ఆడిసన్‌తో వస్తుంది. కారెన్‌ను అక్కడ ఒంటరిగా కలవాలని కోరుకుంటుంది. కారెన్‌ అప్పటికే ఈవ్‌తో దూరంగా ఉన్నా, మార్గో చెప్పడంతో ఈవ్‌ను కలుస్తుంది. అప్పుడు ఈవ్‌, రిచర్డ్స్‌ రాస్తున్న కొత్త నాటకంలో మార్గోను కాకుండా తనను ప్రధాన నటిగా తీసుకోవాలని, లేదంటే కారెన్‌ ఈవ్‌ కు సహాయపడడానికి ఆ ప్రదర్శనకు మార్గో రాకుండా కారు ఆగేలా చేసిందన్న నిజాన్ని మార్గోకు చెబుతానని, దానితో వారి చిన్ననాటి స్నేహం విచ్ఛిన్నమౌతుందని భయపెడుతుంది. కోపంతో అయోమయంతో మార్గో, బిల్‌ ల దగ్గరకు వస్తుంది కారెన్‌. కాని అక్కడే వారి సంభాషణ మధ్యలో మార్గో తాను కొత్త నాటకంలో నటించదలచుకోలేదని వివాహం తరువాత తన వయసు పాత్రలకే తాను పరిమితమవదల్చుకున్నానని చెబుతుంది. ఇది కారెన్‌కు ఎంతో ఆనందాన్నిస్తుంది.
ఈవ్‌ రిచర్డ్‌ నాటకంలో హీరోయిన్‌గా తన కెరీర్‌ మొదలెడుతుంది. ఆ సందర్భంలో రిచర్డ్‌ను ప్రేమలోకి దింపాలని ప్రయత్నిస్తుంది. ఈ లోపే ఆడిసన్‌తో తాను రిచర్డ్‌ను పెళ్ళి చేసుకుంటానని, రిచర్డ్‌, కారెన్‌ కు విడాకులిచ్చి తనను వివాహం చేసుకుంటాడని, అతను తన కోసం మంచి నాటకాలు రాస్తూ తనను గొప్ప స్థితికి తీసుకువస్తాడని చెబుతుంది. ఆడిసన్‌ ఆమె గతం గురించి తాను తెలుసుకున్న విషయాలను బయటపెడతాడు. ఒక ధనవంతున్ని ప్రేమ పేరుతో మోసం చేసినందుకు ఆమెను ఇంతకు ముందు ఓ నగరం నుండి గెంటేసారని, ఆమెకు వివాహం కాలేదని, మార్గోతో ఆమె చెప్పిన కథ అబద్దమని తనకు తెలుసని, తన చేతి క్రింద ఆమె ఉండిపోవాలని లేదా ఆమె గతం నలుగురి ముందు బైట పెడతానని ఆడిసన్‌ ఆమెను భయపెడతాడు. తప్పక ఆమె మౌనంగా ఆడిసన్‌కు లొంగిపోతుంది.
క్రమంగా ఆమె నటనలో ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. రంగస్థలంపై నటులకు ఇచ్చే అతి పెద్ద బహుమతిని ఆమె సంపాదిస్తుంది. ఆ బహుమతి ప్రధానోత్సవంలో ఆమె ఎంతో ప్రేమతో తన ఉన్నతికి సహయం చేసిన వారిగా మార్గో, కారెన్‌, బిల్‌, రిచర్డ్స్‌ కు కతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఆమెలోని స్వార్ధాన్ని చూడగలిగిన ఆ నలుగురు మౌనంగా ఆమెను చూస్తూ ఉండగా అందరి కరతాళ ద్వనుల మధ్యన ఈవ్‌ అతి పెద్ద అవార్డు తీసుకుని ఆడిసన్‌తో తన భవంతి చేరుతుంది.
ఈవ్‌ ఇంటికి వచ్చేసరికి ఆమె గదిలో ఓ అపరిచిత యువతి నిద్రపోతూ కనిపిస్తుంది. తాను ఈవ్‌ వీరాభిమానినని ఆమె గది చూడడానికి తానామె లేని సమయంలో ఆ ఇంట దొంగతనంగా ప్రవేశించానని, ఆమె ఎదురుగా ఉండడమే తన జీవితంలో పెద్ద అదష్టం అని చెపుతుంది. ఎంత ఉన్నత స్థితికి వచ్చినా ఎవరి అభిమానానికీ నోచుకోని ఈవ్‌కి ఆ యువతి చాలా దగ్గరయినదిగా అనిపిస్తుంది. ఆమెతో చిన్న చిన్న పనులు చేయించుకోవడం మొదలెడుతుంది. ఇంటికి వచ్చిన ఆడిసన్‌ ఆ యువతిలో మరో ఈవ్‌ని చూస్తాడు. ఒకప్పుడు మార్గోకి జరిగినదే ఇప్పుడు ఈవ్‌ కి జరగబోతుందని, మరో యువతి ఆ రంగస్థల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతుందని తన వలలో మరో చేప పడబోతుందని అతనికి అర్ధం అవుతుంది. ఆ యువతిలో ఒకప్పటి ఈవ్‌ పోలికలు కనిపిస్తుండగా సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో ఆనీ బాక్స్‌టర్‌, బెట్టీ డేవిస్‌, ఇద్దరికీ ఉత్తమ నటి కేటగిరీలలో ఆస్కార్‌ నామినేషన్లు లభిస్తే, కారెన్‌ పాత్రలో నటించిన సెలెస్టె హోమ్‌, మార్గో ఆయాగా నటించిన తెల్మా రిట్టర్‌ కు ఉత్తమ సహయ నటి నామినేషన్లు లభించాయి. అలా ఒకే సినిమాలో నలుగురు స్త్రీలకు నామినేషన్లు సంపాదించిన చిత్రంగా ఇది రికార్డుకెక్కింది. ఇప్పటిదాకా ఆ గౌరవం మరే చిత్రానికి దక్కలేదు. అలాగే ఈ సినిమాకు పద్నాలుగు ఆస్కార్‌ నామినేషన్లు లభించాయి. ఆ తరువాత టైటానిక్‌ (1997) లాలా లాండ్‌ (2016) సినిమాలకే ఆ గౌరవం దక్కింది. కాని పద్నాలుగులో ఆరు అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది.
ఇందులో మూడు జంటలు కనిపిస్తాయి. కారెన్‌, రిచర్డ్‌ ది ఒక జంట. ఇద్దరూ సౌమ్యులు. అందరిలోనూ మంచితనాన్ని చూసేవాళ్లు. ఇద్దరూ ఈవ్‌ కు సహాయం చేయబోయి పెద్ద ప్రమాదంలో పడతారు. ఈవ్‌ వారిద్దరినీ మోసం చేస్తుంది. వారిని వేరు చేయాలని ప్రయత్నిస్తుంది. చివరి దాకా ఈవ్‌ లోని స్వార్ధం రిచర్డ్స్‌కు కనిపించనే కనిపించదు. ఇక మరో జంట మార్గో, బిల్‌ లు. ఇద్దరూ గొప్ప కళాకారులు, ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. కాని ఇద్దరూ తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో బలహీనులు. కాని ఈవ్‌ లోని స్వార్ధాన్ని తొందరగా గమనిస్తారు ఇద్దరూ. ఈవ్‌ వల్ల ఎక్కువ నష్టపోకుండా వీరు బైటపడడానికి కారణం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ. కథలో ఈవ్‌, మార్గో భర్తను లోబర్చుకుంటుంది. సినిమాలో భర్త కాకుండా ఆ పాత్రను ప్రియుడిగా మార్చి కథంతా అలాగే ఉంచినా మార్గోను, బిల్‌ ను దూరం కానివ్వలేదు దర్శకులు జోసెఫ్‌. ఎల్‌. మాన్క్‌ఇజిక్‌. ఇక మరో జంట ఈవ్‌, ఆడిసన్‌ లు ఇద్దరూ స్వార్ధపరులే. ఒకరినొకరు బ్లాక్‌ మెయిల్‌ చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకుంటూ తమ స్వార్ధం కోసం ఇతరులను ఉపయోగించుకుంటూ జీవిస్తారు. అందుకే చివర్లో ఈవ్‌ ఇంట్లో మరో అమ్మాయిని చూసిన ఆడిసన్‌ ఆమెలో తమ భవిష్యత్తును చూడగలుగుతాడు. అలాంటి వారిని తొందరగా గుర్తించడం అతని నైపుణ్యం. ఈవ్‌ తో సహజీవనానికి ముందు అతను మరో అమ్మాయితో తిరుగుతుంటాడు. ఆమెను నటిని చేస్తానని ఆమెకు మాయమాటలు చెబుతూ ఉంటాడు. ఆ నటి పాత్రలో మార్లిన్‌ మన్రో కనిపిస్తుంది. హాలివుడ్‌ లో కాలుపెట్టిన కొత్తల్లో ఆమె చేసిన చిన్న పాత్రల్లో ఇది ఒకటి.
ఇలా ఒకే స్వభావం ఉన్న మూడు జంటల నడుమ కథ నడిపిస్తూ రంగుల ప్రపంచంలోని స్వార్ధాన్ని, మనుష్యులను ఉపయోగించుకుంటూ పైకి ఎగబాకాలనే తాపత్రయం ఉన్న కళాకారుల జీవితాలను చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో జరిగింది. నిజానికి ఈవ్‌ పాత్ర ఓ కళాకారిణిదే అని కథ రాసిన రచయిత ఆ తరువాత చెప్పడం కొసమెరుపు. ఏమైనా ఈ కథను చిత్రంగా మార్చడంలో దర్శకుల కృషి మెచ్చుకోవాలి. సినిమాలో చాలాసేపు ఈవ్‌ పాత్రపై సానుభూతి, మార్గో పట్ల అనుమానం ప్రేక్షకులలో ఉండేలా చూడగలిగారు.

– పి.జ్యోతి,
98853 84740