– పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యోచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకనుగుణంగా ప్రాథమిక కసరత్తులు ప్రారంభమైనట్టు తెలిసింది. వాస్తవానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతీయేటా మార్చిలో ప్రవేశపెట్టటం ఆనవాయితీ. అయితే వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలో మార్చి నుంచే ఎలక్షన్ల సందడి మొదలు కానుంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, జాతీయ నాయకుల బహిరంగ సభలు తదితరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల అధికార పార్టీకి సమయం సరిపోయినంత ఉండదు. ఈ కారణం రీత్యా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రక్రియను ఫిబ్రవరిలోనే ముగించి, ఆ తర్వాత ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టకపోతే మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం (శాసనసభ అనుమతి ఉండదు కాబట్టి) జీత భత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల మధ్యే మార్గంగా ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయా వర్గాలు వివరించాయి. ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర బడ్జెట్ ఉంటుంది కాబట్టి… ఆ పద్దులో రాష్ట్రానికి వచ్చే రాబడులు, గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయాల ఆధారంగా లెక్కలేసుకుని, ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందిస్తామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.