నాయకగణాల
ఐదేళ్ల అజ్ఞాతానికి తెరపడి
ఓటరు జనాల
మరో ఐదేళ్ల అజ్ఞానానికి తెరలేస్తుంటే
రాజకీయ చదరంగం నిండా
చెదపురుగుల అడుగుజాడలే
ఆదిమధ్యాంతరాలు లేని
అవినీతి చరితలు అదేపనిగా
పాతముఖాల్లో కొత్తనవ్వులు పోకుండా
అద్దుకుని
పాతకథకు కొత్త మలుపులు లేకుండా
అడ్డుకుని
ఎదురు మొలిచిన వేళ్లను
అరచేతిలో వైకుంఠం పెట్టి
సిరాతో తట్టి ఉరితీస్తుంటే
విచక్షణ తట్టిలేపి ఓటర్లే విస్ఫలింగాలై
విరుచుకుపడాలి
కొత్త భారతానికి కొన్ని అడుగులు పడ్డాచాలు..
పాతకథ అడ్డం తిరగడానికి
కొత్త కథ నిలువుగా దూసుకెళ్లడానికి..
తల వాల్చేసిన ప్రతివేలు తలెత్తి
కొత్త రాజకీయానికి తరలిరావాలి…
(నేడు జాతీయ ఓటరు దినోత్సవం)
– భీమవరపు పురుషోత్తమ్