ఓటే వజ్రాయుధం..!

Ote Vajrayudham..!ఓటు ప్రజాస్వామ్యానికి పునాది. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, పేద, ధనిక అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పించింది. ఓటు కలిగి ఉండటం ప్రతీ పౌరుడి అస్తిత్వానికి ప్రతీక లాంటింది. ఈ ఓటు ద్వారా ప్రస్తుత సమాజ స్థితిగతులను మార్చేందుకు వీలవు తుంది. ఒక మంచి సమాజం అభివృద్ధి కావాలంటే ఆ సామాజిక వ్యవస్థకు మంచి ప్రజాప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునేందుకు ఓటు అంతే అవ సరం. కానీ సమాజంలో చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, ఓ రాజకీయతంతుగా, అమ్ముకునే వస్తువుగానే భావిస్తు న్నారా అనే సందేహం నేడు ఉత్పన్నమవుతున్నది. ఇది ఎంత మాత్రం సరికాదు. మద్యం, ధనం ప్రలోభాలకు లోనైతే గనుక మన జీవి తాలనే కాదు మన పిల్లల భవిష్యత్తును మనమే చేజేతులా నాశనం చేసినట్టవుతుంది.
నేడు కొందరు ఓటర్లు తమ ఓటును నోటుకు, మందుకు, తాత్కాలిక తాయిలాలకు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించు కుంటున్నారే తప్ప దేశం, రాష్ట్రం, గ్రామం అభివృద్ధి చెందాలనీ, సమాజం పురోగతి సాధించాలనీ ఆలోచించడం లేదు. మనం బాగుపడాలనే తాపత్రయం ఏ ఒక్కరిలో కనిపించటం లేదు. ఇది బాధాకరం. అభివృద్ధి కావాలన్నా, సరైన మార్గంలో పురోగతి సాధిం చాలన్నా ఓటు సక్రమ వినియోగం చాలా ముఖ్యం. సరైన నాయకుడిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అతి ముఖ్యమైనది. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును నిజాయితీగా వినియో గించుకోవాలి.
సమాజం గురించి అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి చూపటం లేదు. అధిక శాతం ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం కాకుండా కేవలం సంపాదన, స్వార్థ ప్రయోజనాల కోసం కోసం రాజకీయాలను ఆశ్రయించడం వల్ల ప్రజాస్వామ్యం పట్ల గౌరవం తగ్గిపోతున్నదా అన్న సందేహం కలుగుతోంది. కానీ ఓటు హక్కును విధిగా విని యోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దీనిని ప్రజాస్వామ్య సంస్కారంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రతి పౌరుడు తను స్వతహాగా ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవ ర్చుకోవలసి ఉంటుంది. మొట్టమొదటిసారి రాజ్యాంగ నియమాల ప్రకారం 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు భారతదేశం లో ప్రతిచోటా పండుగలా జరుపుకున్నారు. అయితే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. కానీ ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తి కాదు. అందరికీ ఓటు హక్కు కల్పిం చడం, వారు సక్రమంగా, ప్రశాంతంగా ఓటు వేయడానికి అను కూల పరిస్థితులు అందుబాటులోకి తేవడం కూడా కీలకమే. ఓటింగు ద్వారా మన అభిప్రాయాలను వ్యక్తం చేయగలం. మనం మన చేతిలోని ఓటు అనే ఆయుధం ద్వారా మన దేశం భవిష్యత్తును నిర్ణయించగలం. ఈ వాస్తవాన్ని అందరూ తెలుసుకోవాలి. ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోవాలి.
– వై.చంద్రకాంత్‌ గౌడ్‌, 9441762105