– భారత్ జోడో న్యారు యాత్రలో రాహుల్ గాంధీ
కోహిమా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యారు యాత్ర 2.0 బుధవారం నాలుగో రోజుకు చేరింది. నాగాలాండ్‌లోని మోకాక్‌ఛంగ్ జిల్లాలో ఆయన పర్యటించారు. వాహనదారులతో ముచ్చటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈశాన్య ప్రాంతానికీ అంతే ప్రాధాన్యత ఉన్నదన్న సంకేతాన్ని పంపడమే తన ఉద్దేశమని చెప్పారు. జనాభా తక్కువే అయినప్పటికీ దాని ప్రాధాన్యత మాత్రం ఒకేలా ఉంటుందని తెలిపారు. మతాన్ని అవకాశంగా తీసుకోవాలని తాను ప్రయత్నించడం లేదని, తన మత సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించేందుకు కృషి చేస్తానని అన్నారు. ‘నేను ప్రజలను గౌరవిస్తాను. అహంకారంతో మాట్లాడను. విద్వేషాలను వ్యాప్తి చేయను. నాకు సంబంధించినంత వరకూ ఇదే హిందూయిజం’ అని చెప్పారు. నాగాల సమస్యకు పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉన్నదని రాహుల్ తెలిపారు. ‘అయితే దీనిపై సంప్రదింపులు జరగడం లేదు. పరిష్కారం లభించాలంటే ఒకరు చెప్పినది మరొకరు వినాలి. సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ఈ విషయంలో ప్రధాని ఎలాంటి చొరవ చూపడం లేదు’ అని అన్నారు. ప్రధాని మోడీపై ఆయన విమర్శలు కురిపిస్తూ ఆయన ఆలోచించకుండానే హామీలు ఇస్తుంటారని, అందుకే ప్రజల్లో ప్రధాని పట్ల ఉన్న విశ్వసనీయత సడలిపోతోందని చెప్పారు. ‘దేశం లోని యువతకు ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. విద్య, ఉపాధిపై భరోసా ఇచ్చారు. అయితే గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ఏమీ జరగకపోవడంతో ప్రధాని విశ్వసనీయత తగ్గిపోతోంది’ అని రాహుల్ అన్నారు.