లేదంటే నిరవధిక సమ్మె తప్పదు

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్స్‌కు పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా జీవో నెంబర్‌ 60 ప్రకారం రూ.19 వేల కనీస వేతనం వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె తప్పదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జిల్లా సదస్సు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోతపాక వినోద్‌ కుమార్‌ అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం మంచినీరు, వీధిలైట్ల నిర్వహణ పన్నుల వసూలు తదితర పనులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను తక్కువ వేతనాలతో పని చేయించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో పీఆర్సీ ప్రకారం అందరికీ వేతనాలు పెంచిన ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం పోరాడిన తర్వాత రూ.1000 పెంచడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించాడు. మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయకుండా, పది లక్షల బీమా సౌకర్యం కల్పించకుండా పర్మినెంట్‌ మాట ఎత్తకుండా ఎక్కడి సమస్యలు అక్కడే పెట్టి వేయి రూపాయలు వేతనం పెంచి మోసం చేయాలని చూస్తుందని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో అనేక పంచాయతీలలో నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా కార్మికులను పస్తులు ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన బడ్జెట్‌ సర్పంచులు సొంత అవసరాలకు వాడుకొని కార్మికుల కడుపు కాలుస్తున్నారని, పెండింగ్‌ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ రాష్ట్ర కమిటీఈ నెల 29, 30 తేదీలలో కార్యదర్శులకు వినతి పత్రాలు, జూన్‌ 1న ఎంపీడీవో ధర్నా, జూన్‌ 2 నుండి 10 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు సామూహిక రాయబారాలు, జూన్‌ 12న కలెక్టరేట్‌ ముట్టడి అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే జూన్‌19 తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా నాయకులు పీ.అంజయ్య, ఏర్పుల సైదులు, ఎం.రమేష్‌, పీ.సర్వయ్య, రెడ్డిమల్ల యాదగిరి, ఇరిగి ఎల్లేష్‌, .జీ. గంగారాం, సిహెచ్‌. రమేష్‌, వెంకన్న, నరేష్‌ బాలమ్మ, పెద్దమ్మ, ఏసోబు, తదితరులు పాల్గొన్నారు.