మన కెమెరామెన్లు అద్భుతాలు చేయగలరు

Our
Cameramen
Miracles
can doతెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్‌ ఎస్‌ గోపాల్‌ రెడ్డి ( లైఫ్‌ టైమ్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డ్‌), ఛోటా కె. నాయుడు, కె కె సెంథిల్‌ కుమార్‌, శరత్‌, కె రవీంద్రబాబు, సి రామ్‌ ప్రసాద్‌, హరి అనుమోలు, రసూల్‌ ఎల్లోర్‌లను ఘనంగా సత్కరించారు.
యువ సినిమాటోగ్రాఫర్స్‌ కార్తిక్‌ ఘట్టమనేని, ఉదరు గుర్రాలను సినిమాటిక్‌ విజనరీ అవార్డ్స్‌, సాయి శ్రీరామ్‌, దాశరధి శివేంద్ర, నగేష్‌ బ్యానల్‌, బాల్రెడ్డి, సినిమాటిక్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌తో సత్కరించారు. ఈ వేడుకలో దర్శకులు కోదండరామి రెడ్డి, వివి వినాయక్‌, ఇంద్రగంటి మోహన్‌ కష్ణ, ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి, సాయి రాజేష్‌, దామోదర్‌ ప్రసాద్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో ఎస్‌.గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌గా 55 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. నా మిత్రులందరి ముందు ఈ సత్కారం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘మన తెలుగులోనే ది బెస్ట్‌ కెమెరామెన్స్‌ వస్తున్నారు. సరైన అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారు. ఇండియన్‌ సినిమాని తెలుగు కెమెరామెన్‌ రూల్‌ చేస్తారనే నమ్మకం ఉంది. దీన్ని సవాల్‌గా తీసుకొని ముందుకు వెళ్ళాలి’ అని ఛోటా కె. నాయుడు అన్నారు.సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘ఐతే’ సినిమా చేస్తున్నప్పుడు నేను కూడా ఒక బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ అవ్వాలని కల కన్నాను. ఈ రోజు ఒకటికాదు.. రెండు కాదు.. మూడు వెయ్యి కోట్ల సినిమాలు చేశాను. బహుశా ఆస్కార్‌ కమిటీలో ఉన్న ఇండియన్‌ టెక్నిషియన్‌ని నేను అనుకుంటాను. ఇటీవలే ఇన్విటేషన్‌ వచ్చింది. ఇదొక అచీవ్మెంట్‌గా భావిస్తున్నా. తెలుగు సినిమా చేస్తే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనడానికి ఇది నిదర్శనం’ అని తెలిపారు. ‘కొత్తగా వచ్చే కెమెరామెన్‌కి ఒక సలహా. దర్శకులు ఏం చెప్తే అది చేయడం మంచిదే. కానీ కొందరికి లైటింగ్‌ మీద అంత పట్టులేకపోవచ్చు. అలాంటప్పుడు దర్శకుడిని కన్వీన్స్‌ చేసి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి విషయంలో చోటాకె నాయుడు దిట్ట (నవ్వుతూ) ఎవరినైనా మ్యాజిక్‌ చేస్తారు. ఆ మ్యాజిక్‌ అందరూ నేర్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలి’ అని దర్శకుడు వి.వి.వినాయక్‌ చెప్పారు.