మానవజీవితంలో బాల్యం ఓ అపురూపమైన అద్భుత దశ. బాలారిష్టాలు తొలగి బాలలు స్వేచ్ఛగా ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగుపొరుగువారు పాఠశాల ఉపాధ్యాయులు, మిత్రులు.. ఇలా ఎందరో, ఎంతగానో సహకరిస్తారు. పిల్లల్ని కనిపెంచే ప్రక్రియ జంతువులతో పాటు మనిషికి ప్రకృతిసిద్ధంగా లభించింది. మానవ పరిణామ క్రమంలో చైతన్యవంతమైన మానవీయ స్పందన బాలల పెంపకంలో అంతర్భాగమైంది. కనుకనే పిల్లల పెంపకం అనేది మానవజాతి సంస్కృతికి జీవకర్రగా నిలిచింది.
అగ్రికల్చర్ నుండే మనకు కల్చర్ వచ్చింది. సేద్యం నుండి సంస్కృతి. సమిష్టి మనుగడలోనే కాకుండా సమిష్టి ఉత్పత్తిలో కూడా మనం భాగస్వామ్యం కావడం మన సంస్కృతికో మచ్చుతునక. కల్టివేట్ అంటే సేద్యం చేయడం. చీడపీడల నుండి మొక్కలను రక్షించి స్వేచ్ఛగా ఎలా ఎదగనిస్తామో అలాగే సహజసిద్ధంగా మనం మన పిల్లలను ఎదగనీయాలని, అదే నిజమైన స్వేచ్ఛ, సంస్కృతికి ప్రతిబింబమని ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ పేర్కొంటారు. ‘సంస్కృతి’ అంటే జీవన విధానం అని స్థూలంగా నిర్వచనం చెప్పుకున్నప్పుడు ఆ సంస్కృతికి ప్రాణప్రదమైనది ‘పిల్లల పెంపకం’ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అసలు జీవితం అంటే ఏమిటి? ఇదో తాత్వికమైన ప్రశ్న. కొందరికి డబ్బు సంపాయించడమే జీవిత ధ్యేయం. మరికొందరికి భోగలాలసత్వం అనుభవించడం జీవితం. ఇంకొందరికి బంగారం, ఆభరణాలు వస్తు వ్యామోహం. మరికొందరికి ఆధిపత్యం, పెత్తనం, అధికారం కీర్తిదాహం. తాగుడు, జూదం, వ్యభిచారం వ్యసనాలకు బానిసయ్యేవారు ఇంకొందరు. చాలామంది ఏ ఇబ్బందుల్లేని భద్రమైన జీవితం కోరుకుంటారు. కనీసావసరాలు తీరక పేదలు జీవన పోరాటం చేస్తుంటారు. కొందరు మాత్రమే పరుల సేవలో (బాధితుల సేవలో) తరిస్తారు. దేశం కోసం తపిస్తారు. ప్రజల కోసం పాటుపడతారు. త్యాగాలు చేస్తారు. పోరాటాలు చేస్తారు. ప్రాణాలను తృణప్రాయంగా కూడా అర్పిస్తారు. ఉద్యమాలే శ్వాసగా జీవిస్తారు. ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు ఉద్యమ జీవితమే ఉత్కృష్టమైన జీవితం అని చెప్పుకోవచ్చు.
ఈ ఆధునిక నవమానవుని జీవితంలో కూడా పరలోక సుఖప్రాప్తి కోసం (స్వర్గం, మోక్షం) ముక్తి మార్గం అంటూ భక్తిమార్గంలో కొట్టుకుపోతున్నవారు ఎందరో ఉన్నారు. ఎవరి దేవుణ్ణి (దేవతను) వారు కొలుచుకోవడం తప్పుకాదు. ఆ మత స్వేచ్ఛ మనకు ఉన్నది. రాజ్యాంగం కల్పించింది. పరమత ద్వేషమే మూర్ఖత్వం. ఇది ఒకవిధంగా అమానవీయ సంస్కృతి కూడా. తత్కారణంగా మత ఘర్షణలు యుద్ధాలు చెలరేగుతున్నాయి. క్రీ.పూ. మూడవ శతాబ్దంలోనే వీటన్నింటికి గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ చక్కటి సమాధానమిచ్చాడు. ‘రాజు దైవాంశ సంభూతుడు, రాజ్యాధికారం దైవ ధిక్కారం’ అని రాజులు స్వతహాగా ప్రచారం చేసుకుంటున్న చీకటి రోజులవి. ప్రజలకు జ్ఞానబోధ చేసే సోక్రటీస్ సహజంగానే ఆ రాజుకు కంటగింపు అయ్యాడు. దైవద్రోహిగా ముద్రవేసి సోక్రటీస్‌కు మరణశిక్ష విధించాడు. తనకు తానుగా విషం తాగి మరణించడం ఆనాటి శిక్షా విధానం.
మరణించే ముందు మీ కడసారి కోరిక ఏమిటి? అని సోక్రటీస్‌ను అడిగినప్పుడు జైలుగోడలు బయటవున్న అంధుడైన గాయకుడిని తన వద్దకు తీసుకురమ్మని కోరతాడు. భటులు తీసుకువస్తారు. గాయకుని పాటను అతను వాయిస్తున్న లయర్ వాద్య సంగీతాన్ని తనకు నేర్పించమని ప్రాథేయపడతాడు సోక్రటీస్. అదేమంత భాగ్యం అంటూ ఆ రెంటినీ గాయకుడు ఆ కొద్ది క్షణాల్లోనే సోక్రటీస్‌కు ఆనందంగా నేర్పుతాడు. ‘నేర్పడం – నేర్చుకోవడం’ అనే ‘జీవకళ’లో ఆ ఇద్దరూ తన్మయులై లోకాన్ని మైమరచిపోయి ఓలలాడారు. ‘ఇది కదా జీవితం. జీవితం అంటే ఇదే.. ఇదే… నేర్చుకోవడం – నేర్పడం’ అని ఆ చివరి క్షణంలో సోక్రటీస్ గట్టిగా అరుస్తూ ప్రకటిస్తాడు. సోక్రటీస్ ప్రకటనతో మానవ జీవన గమనం మారిందని కొందరు చరిత్ర కారులు అభివర్ణిస్తారు. జీవితం అంటేనే నేర్చుకోవడం – నేర్పడం. లైఫ్ ఈజ్ ఏ లెర్నింగ్ జర్నీ. ఇదే జీవనయానం. గాలి పీల్చకుండా గాలి వదలలేం. నేర్చుకోవడం – నేర్పడం అన్నది ఉశ్వాస నిస్వాసాల వంటివి. వయోబేధంతో సహా ఏ బేధమూ ఈ జీవన కళా ప్రక్రియకు అడ్డు రాకూడదని, చైతన్యవంతమైన మానవ జీవనయానం ఇదే అని విస్పష్టంగా లోకానికి విదితమయిందప్పుడు. తక్కినవన్నీ పటాపంచలైపోయయి.
ఇకపోతే మానవ జీవన లక్షణాలేమిటి? అని ప్రశ్నించుకున్నప్పుడు మూడింటిని ముఖ్యంగా పేర్కొన్నారు శాస్త్రజ్ఞులు.
1. కేరింగ్ (పట్టించుకోవడం) :
ఆదిమానవుడు జంతువుల్ని వేటాడే క్రమంలో తోటివారు ఎవరు గాయపడినా సానుభూతి చూపడం, ఉపశమన సపర్యలు చేయడం, రక్షించడం ఓ మానవీయ లక్షణంగా పరిణమించింది. సహజ సిద్ధంగా (ప్రకృతి పరంగా) సక్రమించిన ఈ లక్షణం పరస్పర సహకారంగా వృద్ధి అయింది.
2. షేరింగ్ (పంచుకోవడం) :
మనిషి తనకు కలిగిన కష్టసుఖాలను ఇతరులతో కలిసి పంచుకోవడం, తన అనుభవాలను, అనుభూతులను రసాత్మకంగా వ్యక్తీకరించడం, భాష లేని ఆ రోజుల్లోనే సాధ్యమైంది. ఆ వ్యక్తీకరణలోనే భాష, అభినయం, సంగీతం, చిత్రలేఖనం, కళలు పుట్టాయి. ఆఫ్రికా కొండగుహల్లో ఆనాటి ఆదిమానవులు గీసిన వేల సంవత్సరాల నాటి కుడ్య చిత్రాలు నేటికీ వున్నాయి. చరిత్రను బోధిస్తున్నాయి.
3. రేరింగ్ (పెంపకం) :
బిడ్డలను సాకడం, పెంచడం, జంతువుల నుండి మనకు లభించింది. మార్జాల కిశోర న్యాయం (తల్లి పిల్లల్ని పట్టించుకోవడం – పిల్లిలా), మర్కట కిశోర న్యాయం (పిల్లలే తల్లిని పట్టుకుని వుండడం – కోతిలా). ఈ రెండు లక్షణాలను మనిషి పుణికిపుచ్చుకున్నాడు.
ఈ లక్షణాలు కలిగి వుండడం, వృద్ధి చేసుకోవడం ఉత్తమమైన మానవజీవన సంస్కృతిగా పరిఢవిల్లింది. ఈ క్రమంలోనే మహాకవి శ్రీశ్రీ శాంతి, సమభావం, సమిష్టి క్షేమం ఆధునిక మానవుని జీవన సంస్కృతికి ప్రతీకలుగా అభివర్ణించారు.
ఈ ఉపోధ్ఘాతం ఎందుకంటే మౌలికమైన ఈ జీవన విధాన (సాంస్కృతిక) లక్షణాలను పెద్దలుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక పౌరులు గ్రహించినప్పుడు పిల్లలకు విద్యాబుద్ధులు గరపడంలో చైతన్యవంతమైన కృషి చేయగలరు. విలువలతో కూడిన విద్యాబోధనను, పెంపకాన్ని అందించగలరు. ఆనందించగలరు. లేని పక్షంలో మన పెంపకంలో, బోధనలో యాంత్రికత, మొండితనం (మార్చుకోలేని, మార్చుకోని బండ పద్ధతి) అలవడుతుంది. నిత్యచైతన్యం సృజనశీలత కొరవడుతుంది. అంతకంటే ముఖ్యంగా పిల్లల అభిరుచులను, ఆసక్తులను, ఆకాంక్షలను గమనించలేని అశాస్త్రీయ, అజ్ఞాన, మొద్దు (జడత్వ) భావాలను, పద్ధతులను పిల్లలపై బలవంతంగా రుద్దుతుంటాం.
శారీరక, మానసిక, సామాజిక, తాత్విక ఆరోగ్యాలతో పిలలు ఎదగడం పిల్లల సార్వజనీన హక్కు అని చెప్పే యునిసెఫ్ (ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) సూత్రాన్ని అందుకోలేనంత సుదూరంలో మనం వుంటాం. బాలల్ని కూడా అంతే దూరంలో వుంచడానికి తెలియకుండానే నెట్టుకుంటూ పోతాం. ఇది సాంస్కృతిక తిరోగమనమే తప్ప పురోగమనం కాదు.
జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, చదువుతో సహా అభివృద్ధి చెందే హక్కు, గుర్తింపు గౌరవం పొందే హక్కు, భాగస్వామ్యం వహించే హక్కు… ఈ ఐదు హక్కులు బాలల ప్రాథమిక హక్కులు అనే సోయి ఉన్నప్పుడు మాత్రమే బాలలకు న్యాయం జరుగుతుంది. బాలలు సమగ్ర వికాసంతో సమ్మిళిత అభివృద్ధితో ఎదగాలని యునిసెఫ్ ఏనాడో పిలుపునిచ్చింది. హక్కుల రూపంలో పూల బాట పరిచింది. హక్కుల సాధనా సంస్కృతే నిజమైన జీవన సంస్కృతి అని నినదించింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలలో ఈ సాంస్కృతిక కృషి బహుముఖంగా జరగవలసి ఉంది. మనమందరం భేషరతుగా ఆ బాటలో నడుద్దాం.
– కె.శాంతారావు, 9959745723