మా కమిటీ కుర్రోళ్ళు మెప్పించారు

Our committee guys were impressedనిహారిక కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఈ మూవీ ఈనెల 9న విడుదలైంది. చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కింది. ఇంత భారీ విజయాన్ని ఆడియెన్స్‌ అందించడంతో శనివారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. నిహారిక మాట్లాడుతూ, ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థ్యాంక్స్‌. మా చిత్రాన్ని రమేష్‌ భుజానికెత్తుకుని నడిపించారు. పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందని అంతా అంటున్నారు. మా అందరినీ నమ్మి వంశీ సినిమాను రిలీజ్‌ చేసినందుకు థ్యాంక్స్‌. మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు తీసుకెళ్లిన మీడియాకు థ్యాంక్స్‌. ఇది పీపుల్స్‌ సినిమా అయింది. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది’ అని అన్నారు. ‘మంచి కంటెంట్‌తో ముందుకు వస్తే ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్‌ మళ్లీ నిరూపించారు. సినిమాను హిట్‌ చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్‌’ అని నిర్మాత జయ అడపాక చెప్పారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ, ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్‌. నాలుగేళ్ల క్రితం ఈ ప్రయాణం మొదలైంది. సక్సెస్‌ అనే పదం వినడానికి మూడున్నరేళ్లు పట్టింది. సినిమా తీయడం గొప్ప కాదు.. మా అందరినీ ఎంకరేజ్‌ చేసే నిర్మాతలే గొప్ప. మమ్మల్ని నమ్మి ఇంత డబ్బులు పెట్టిన నిర్మాతలకు థ్యాంక్స్‌. మా అందరినీ ఎంకరేజ్‌ చేస్తున్న ఆడియెన్స్‌కు థ్యాంక్స్‌’ అని అన్నారు. అంకిత్‌ కొయ్య మాట్లాడుతూ, ‘నిహారిక ఈ కథని నమ్మింది. ఈ చిత్రం మీద నమ్మకం కంటే భయం ఎక్కువగా ఉండేది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’ అని తెలిపారు.