మన సైబర్‌ సెక్యురిటీ దేశంలోనే నెంబర్‌ వన్‌

– సైబర్‌ నేరాలపట్ల అప్రమత్తత అవసరం : డీజీపీ రవిగుప్తా
నవతెలంగాణ- సీటీబ్యూరో
మన సైబర్‌ సెక్యూరిటీ సిస్టం దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందని, సైబర్‌ నేరాలపట్ల అప్రమత్తత అవసరమని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. ఎంత చదువుకున్న వారైనా సైబర్‌ నేరాలబారిన పడుతున్నారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. దేశంలోనే టీ4సీని స్థాపించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని, అలాగే దేశంలో ప్రత్యేక సైబర్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది కూడా తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాలను సమగ్ర పద్ధతిలో బ్యూరో పరిశీలిస్తుందని, నేరాల పోకడలను విశ్లేషిస్తుందని, సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. సైబర్‌ నేరస్థులు చెప్పే మాయమాటలతో వారికి చిక్కుతున్నామని తెలిపారు. తాను సైతం ఓసారి సైబర్‌ నేరస్థుల మాయమాటలతో వారికి చిక్కానని, కానీ, అప్రమత్తతో బయటపడ్డానని చెప్పారు. సైబర్‌ నేరస్థులను పట్టుకోవడంలో, రికవరీలో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. బాధితుల నుంచి డబ్బులు కాజేసిన సమయంలో కూడా నేరస్థుల బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసి సొమ్మును రికవరీ చేస్తున్నామన్నారు. టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్‌, శిఖా గోయెల్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్‌ క్రైమ్‌లను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. టీ4సీకి ఇప్పటివరకు 90వేల ఫోన్లు వచ్చాయన్నారు. దాదాపు రూ.128 కోట్లకు పైగా అనుమానిత మొత్తాలను బ్యూరో స్తంభింపజేసిందని, బాధితులకు దాదాపు రూ.8 కోట్ల వరకు రీఫండ్‌ చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో 12,053 పీటీ వారెంట్లు జారీ చేయగా.. అందులో 2025 కేసులు తెలంగాణకు చెందినవి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లకు చెందిన 870 మంది పోలీసు సిబ్బందికి బ్యూరో ప్రత్యేక శిక్షణ అందించినట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నిందితుల సమాచారం, దేశవ్యాప్తంగా సంబంధిత పోలీసు అధికారులతో పంచుకున్న సమాచారాన్ని సేకరించడం ద్వారా బ్యూరోలో మొత్తం 66,726 ఇంటర్‌స్టేట్‌ క్రైమ్‌ లింక్‌లు స్థాపించారనిన్నారు. మొత్తం సైబర్‌ సెక్యూరిటీ వ్యూహంలో భాగంగా, బ్యూరో దాదాపు 19000 అనుమానాస్పద యూఆర్‌ఎల్‌లను పరిశీలించి మోసపూరితమైనదిగా భావించిన 4481 లింక్‌లను తీసేసిందని తెలిపారు. అలాంటి లింక్‌లను హౌస్ట్‌ చేస్తున్న లేదా ఈ లింక్‌ల నుంచి ల్యాండింగ్‌ చేస్తున్న 1638 వెబ్‌సైట్‌లను కూడా తీసేసినట్టు చెప్పారు. 2023-24 సంవత్సరానికి వివిధ ప్రభుత్వ విభాగాలకు 13 కీలకమైన సైబర్‌ సేఫ్టీ అడ్వైజరీలు జారీ చేయడం జరిగిందని, సైబర్‌ నేరగాళ్లు ఉపయోగించే 27,600 సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేసినట్టు తెలిపారు. గత నెల నుంచి, ఐఎంఈఐ బ్లాకింగ్‌ కూడా ప్రారంభమైందని చెప్పారు. వ్యక్తిగత వివరాలను, రహస్య నెంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింక్‌లను క్లిక్‌ చేయొద్దన్నారు. కొరియర్‌, ఇంటర్‌నెట్‌, బ్యాంకింగ్‌ పేర్లతో సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ సీపీ కె.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.