
– మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
నవతెలంగాణ- మల్హర్ రావు
మీ కళ్ల ముందే ఎదిగిన బీసీ బిడ్డగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తి పుట్ట మధూకర్‌ను ఆశీర్వదించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కోరారు. ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ, సావిత్రీబాయిపూలే కాలనీల్లో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోతో పాటు పుట్ట మధూకర చేసిన అభివృధ్ది, సేవలను వివరిస్తూ బొట్టు పెడుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంకోసం వచ్చిన ఆమెకు పోచమ్మవాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, శాలువాలతో సన్మానిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ను ఆదరించి ఆశీర్వదిస్తే నాలుగేండ్లు అనేక అభివృధ్ది పనులతోపాటు సేవలు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ సర్కార్‌లో మంథని మార్పుపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.నాలుగేండ్లు అవకాశం ఇస్తే మీ సేవకులుగా పనిచేశామని ఆమె గుర్తు చేశారు. 2018లో పుట్ట మధూకర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అబద్దాల ప్రచారాలు నమ్మి ఆగమై మోసపోయారని, ఐదేండ్లు ఏమీ చేయనోళ్లకు అధికారం ఇచ్చారని ఆమె అన్నారు. మన ఓట్లతో గెలిచి ఏమీ చేయనోళ్లకు మళ్లీ ఓట్లు వేయడం ఎందుకని ప్రతి ఒక్కరు ఆలోచనచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఈనాడుజెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఆనాడు సర్పంచ్‌గా, ఈనాడు మున్సిపల్ చైర్ పర్సన్‌గా తాముచేసిన అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే ఉన్నాయన్నారు. అనేక ఏండ్లు మంథనిలో కాంగ్రెసపార్టీ నాయకులే ఏలినా కనీసం ప్రజల అవసరాలు తీర్చాలని ఆలోచన చేయలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాంగ్రెస పాలకుల చేతిలో గోసపడ్డ మంథని ప్రజల భవిష్యత్ కోసమే మా ఆరాటమని, మంథనికి వెలుగులు తీసుకురావాలన్నదే మా తపన అని అన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయని ఓట్ల కోసం వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మితే ఐదేండ్ల తరహాలోనే మరో ఐదేండ్లు గోసపడుతామని ఆయన చెప్పారు. బీసీలు, మున్నూరు కాపుల ఆత్మగౌరవం నిలబడాలంటే పుట్ట మధన్నను గెలిపించుకోవాలని, మధన్న గెలుపుతోనే మన వర్గాలు బాగుపడుతాయని ఆమె స్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి పుట్ట మధూకర్‌ను ఆశీర్వదించాలని ఆమె ఈ సందర్బంగా కోరారు.