‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ ఇది మోడీ 2019 ఎన్నికల నినాదం. 2014 ఎన్నికలలో ‘అచ్చేదిన్ ఆనే వాలాహై’ అన్నాడు. కానీ పదేండ్ల పాలనను చూసినప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోంది. ముఖ్యమంత్రులను సైతం అరెస్టు చేసి జైల్లో బంధించి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కడానికి ఉపా చట్టం వినియోగిస్తున్నారు. మణిపూర్, కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక హక్కులు అణిచివేసి ఆ రాష్ట్రాలని అగ్నిగుండంగా మార్చారు. మహిళలని నడిబజార్లో నగంగా ఊరేగించే స్థితికి దేశం దిగజారి పోయింది. రాష్ట్రాల హక్కులు కాలరాసి ఫెడరల్ వ్యవస్థకి సమాధి కడుతున్న రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛని హరించి వేస్తున్నారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాను గుప్పెట్లో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతూ వాటన్నింటినీ బయటపడ కుండా కప్పిపుచ్చుకుంటున్నారు. సిబిఐ, ఈడి, ఐటి, ఎన్‌ఐఎ లాంటి విచారణ సంస్థలని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలని, అసమ్మతి తెలియజేసే వారిని అణిచివేస్తున్నారు. అవినీతి గురించి నిత్యం ప్రగల్బాలు పలికే మోడీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అడ్డంగా దొరికిపోయింది. పీఎం కేర్స్ నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పడానికి వణికిపోతున్నారు.
విచ్చుకుంటున్న మతతత్వ ఎజెండా
కార్పొరేట్ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మోడీ పరిపాలన దేశ లౌకిక పునాదుల మీద తీవ్రమైన దాడులు సాగిస్తున్నది. దేశాన్ని మత రాజ్యంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నది. హిందూమత ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా వ్యవహరిస్తున్నది. బాబ్రీ విధ్వంసం తర్వాత కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదును, మధురలోని ఈద్గా షాహీని హిందూ గుడులని ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ మతతత్వ సంస్థలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆరాధనా స్థలాల (ప్రత్యేక రక్షణ) చట్టం 1991ను ఉల్లంఘించి మరీ హిందూత్వ శక్తులు ప్రభుత్వపరమైన మద్దతుతో న్యాయవ్యవస్థను ప్రభావితం చేసి తాము అనుకున్నది సాధించే ప్రయత్నంలో ఉన్నాయి.నేడు మైనార్టీలు అభద్రతాభావంలో ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలను వేధించడమే లక్ష్యంగా చట్టాలు చేశాయి. గో సంరక్షణ పేరిట ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఒక చట్టం చేశాయి. ఈ చట్టం ముస్లింలను వేధించడానికి ఉద్దేశించి చేసిన చట్టం. పశువుల అమ్మకాల వ్యాపారం, మాంసాహార అమ్మకాల వృత్తిలో ప్రధానంగా ఉన్న ముస్లింల మీద దాడులు చేయడానికి గోసంరక్షణ చట్టాన్ని హిందూత్వ శక్తులు అడ్డం పెట్టుకుంటున్నాయి. మూక హత్యలకు పాల్పడిన నేరస్తులకు మతోన్మాద సంస్థలు ఘనంగా సత్కారం చేస్తున్నాయి. గోరక్ష దళాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఆ విధంగా మూక హత్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో జరిగిన దాడులు ఈ విషయాన్ని సృష్టం చేస్తున్నాయి. అలానే ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మతమార్పిడి (నిరోధక) చట్టాలు తీసుకొచ్చాయి. ఈ చట్టం పౌరులకున్న మత స్వేచ్ఛను హరించాయి. దేశంలో ప్రతి పౌరుడికి తనకు ఇష్టమైన మతాన్ని ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఈ చట్టాలు కాలరాసాయి. హిందూ, ముస్లిం యువతీ యువకులు ప్రేమ వివాహాలు చేసుకోకుండా లవ్- జీహాద్ పేరిట దాడులు చేస్తున్నారు. కేరళ స్టోరీ సినిమా పేరుతో తీవ్రమైన విషం చిమ్మారు. మతాంతర వివాహం చేసుకున్నందుకు కొంతమంది యువకులను అరెస్టు చేయించి జైల్లో పెట్టించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ప్రభుత్వం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ‘ఉమ్మడి పౌరస్కృతి’ బిల్లును తీసుకొచ్చింది. ఇందులో ‘ఉమ్మడి’ ‘పౌర’ అన్న భావనలకు పాతర వేశారు. బీజేపీయేతర రాష్ట్రాలలో కూడా ఈ విధమైన మైనారిటీ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చే విధంగా ఒత్తిడి చేసేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
రెండవ తరగతి పౌరులుగా మైనారిటీలు
గోసంరక్షణ పేరిట పశువుల, మాంస వ్యాపారాలలో ఉన్న ముస్లింల మీద కక్షపూరితమైన దాడులు పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో ఇలాంటి దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హిందూత్వ మూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రయివేటు సైన్యంగా ఏర్పడి మూక హత్యలకు, దాడులకు తెగబడుతున్నా ఆయా ప్రభుత్వాలు మిన్నకుండిపోయి పరోక్షంగా ఈ రౌడీమూకలకు అండగా నిలబడుతున్నాయి.నేర అభియోగాల సాకుగా చూపి ముస్లింల నివాసాలను, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే అక్రమ చర్యలు ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మైనారిటీల ఇండ్ల అక్రమ కూల్చివేత ఆపడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్వయంగా తీసుకొని వెళ్లి బుల్డోజర్‌లకు అడ్డుగా నిలబడిన విషయం ప్రపంచమంతా చూసింది. మైనార్టీలకు నిలువ నీడలేకుండా చేయడానికి బుల్డోజర్‌లను ఆయుధంగా వాడుకునే బుల్డోజర్ రాజ్ నడుస్తోంది. ఒక్క హర్యానా రాష్ట్రంలోనే ‘నూహు’లో ఏకంగా 1208 ఇండ్లను ఇలా కూల్చివేశారు. ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా దిగజార్చడానికి బీజేపీ చేస్తున్న దుర్మార్గాలకు ఇవి కొన్ని ఉదాహారణలు మాత్రమే.
హింసాత్మక దాడులు ఆపాలి
గోమాంసం దగ్గర ఉందనే సాకుతో మూకదాడులకు పాల్పడడం పరిపాటిగా మారింది. 2015లో మహ్మద్ అఖ్లాక్‌ను ఇలానే హత్య చేశారు. పాల డెయిరీ రైతు ఫహ్లుఖాన్‌ను నడీ రోడ్డుపై పోలీసుల సమక్షంలో దాడి చేసి చంపేశారు. దాడులకు పాల్పడినవారి మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూత్వ మూకలు మరింత పెట్రేగిపోతున్నాయి. ఒక్క 2019 సంవత్సరంలోనే మీడియాలో వచ్చిన వార్తల మేరకే 107 మూకదాడులు జరిగాయి. హిందూ పండుగల సందర్భాలను మతవిద్వేషాలు, మత హింసను రెచ్చగొట్టడానికి వాడుతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో 2017 నుండే ఈ విధమైన దాడుల గణాంకాలు సేకరించడం నిలిపివేసింది. భారత శిక్షాస్కృతి సెక్షన్ 153ఎ ప్రకారం మత విద్వేష ప్రసంగాలు శిక్షార్హమైన నేరాలు, నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలను పరిశీలిస్తే 2021లో ఈ సెక్షన్ క్రింద 993 కేసులు నమోదయ్యాయి, అదే 2022 నాటికి వచ్చేసరికి ఈ కేసుల సంఖ్య 1,444కి పెరిగింది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను, ఊరేగింపులను అడ్డం పెట్టుకుని హిందూత్వ శక్తులు ముస్లింలపై దాడులకు దిగడం ఈ మధ్యకాలంలో పెరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఈ దాడులు జరగడం, దాడుల అనంతరం కేవలం ముస్లింలను పోలీసులు అరెస్టు చేయడం చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడులని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో 2022-23 సంవత్సరాలలో ఈ రకమైన దాడులు పెచ్చరిల్లాయి. 2023లో 720 ప్రార్ధనా స్థలాలు, చర్చిలమీద దాడులు జరిగాయని, 2014లో 147 దాడులు జరగగా 2021లో 505 దాడులు, 2022లో 509 దాడులు జరిగాయని ఈ రకమైన దాడులను అరి కట్టాలని విజ్ఞప్తి చేస్తూ యునైటెడ్ క్రిష్టియన్ ఫోరమ్ రాష్ట్రపతికి ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది.”మా ప్రభుత్వ హయాంలో మత కలహాలను అరికట్టాం’ అని మోడీ చేసిన ప్రకటనలకు, వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేని పరిస్థితి ఇది. అంతెందుకు 2022 డిసెంబర్ 7న రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రామ్ సభ్యుల ప్రశ్నకు సమాధానంగా 2017-2022 మధ్య ఐదేండ్లకాలంలో 2900 మతకలహ సంఘటనలు చోటుచేసుకున్నట్లు ప్రకటించాడు. మోడీ ప్రకటనలో డొల్లతనాన్ని ఈ గణాంకాలు బహిర్గతం చేస్తున్నాయి. 2019- 2020 సంవత్సరాలలో మన దేశంలో సామాజిక తరగతుల సంఘర్షణలు పెచ్చరిల్లి ప్రమాదకర స్థాయికి చేరాయని ‘ప్యూ’ పరిశోధనా కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో ముంచుకొస్తున్న ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో పట్టుకోసం మతోన్మాదులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడి ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని రజాకార్ సినిమా పేరుతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నోటికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ తెలంగాణ ప్రజలపై మతతత్వాన్ని రుద్దడానికి జరుగుతున్న కుట్రలే. మోడీ నాయకత్వంలోని బీజేపీని అధికార పీఠం నుండి తప్పిస్తే తప్ప లౌకిక రాజ్యాన్ని నిలుపుకోలేం. మరోసారి, మోడీ అధికారం చేబడితే మనదేశాన్ని మత రాజ్యంగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రణాళిక అమలు కావడం ఖాయం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేవి మోడీ బక్వాస్ తప్ప నిజం కాదు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళల పైన, కార్మికులు, రైతుల పైన నిరుద్యోగులపైన సాధా రణ ప్రజల పైన తీవ్రమైన దాడి జరుగుతున్నది. దేశ లౌకిక పునాదులు, ప్రజాస్వామిక విలువలు ధ్వంసం చేయబడుతున్నా యి. వాటిని కాపాడుకోవడం దేశ పౌరుల అందరి బాధ్యత. మనదేశ ప్రజాస్వామిక విలువలను, లౌకిక స్ఫూర్తిని, సమాఖ్య భావనలను నిలుపుకోవాలంటే రానున్న ఎన్నికలలో హిందూత్వ శక్తులను, దానితో అంటకాగే రాజకీయపక్షాలను ఓడించి తీరాల్సిందే. అదే ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం..
– ఎం.డి. అబ్బాస్, 9490098032