మా కుటుంబాలు రోడ్డున పడతాయి

మా కుటుంబాలు రోడ్డున పడతాయి– సీఎం రేవంత్‌ రెడ్డి తగిన పరిష్కారం చూపించాలి
– నెలకు రూ.15 వేల జీవన భృతి అందించాలని విజ్ఞప్తి
– హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్స్‌ సమావేశం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని తెలంగాణ ఆటో మోటార్స్‌ డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై తెలంగాణ ఆటో మోటార్స్‌ డ్రైవర్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మారయ్య మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో తమకు జీవన భృతి కింద నెలకు రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆటో డ్రైవర్లకు తగిన పరిష్కార మార్గాలు చూపాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆటో మోటార్స్‌ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలన్నారు. ఆటో మీటర్‌ రేట్లు పెంచి కొత్త పర్మిట్‌ ఇవ్వాలని కోరారు. ఓలా, ఉబర్‌ సంస్థలను ప్రభుత్వం వారి ఆధీనంలోకి తీసుకొని నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ కార్యదర్శి చిన్న బాల నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతం రమేష్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌, ఎండి. వాజిద్‌, ఎండి పర్వేజ్‌ తదితరులు పాల్గొన్నారు.