– న్యాయం చేయండి: మంత్రి దామోదరకు 317 జీవో బాధితుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా 317 జీవోను తీసుకొచ్చిందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జీవో కారణంగా తమ కుటుంబాలు కష్టాలను ఎదుర్కొంటున్నాయని వాపోయారు. బాధిత కుటుంబాలను ఆ కష్టాల నుంచి గట్టెక్కించాలని వారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించుకున్నారు.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన బాధితులు వినతిపత్రాన్ని సమర్పించారు. 317 జీవోపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోపై ఏర్పాటు అయిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మెన్‌గా దామోదర రాజనర్సింహను నియమించినందుకు బాధితులు తమకు న్యాయం జరుగుతుందని
ఈ సందర్భంగా బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ కమిటీ తీసుకునే నిర్ణయాలతో రాష్ట్రంలోని ఉద్యోగులు, వారి కుటుంబాలతో పాటు తమ స్థానికత, పదోన్నతులు, బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రికి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పునర్ సమీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో బాధితులు రాపోలు శేఖర్, నిరీక్షణ, దీపిక, అనిత, గుగులోత్ మధు, రాథోడ్ కిరణ్, ఆలూరు మంజుల, పల్లవి లతోపాటు పలువురు బాధితులు ఉన్నారు.