– పసిడి పోరులో శ్రీలంకపై ఘన విజయం
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించారు అమ్మాయిలు. సోమవారం జరిగిన పసిడి పోరులో శ్రీలంక మహిళల జట్టును చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన 19 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మంధాన (46, 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రొడ్రిగస్ (42, 40 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. ఛేదనలో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులే చేసింది. భారత యువ పేసర్ టిటాస్ సాధు (3/6) నిప్పులు చెరిగే ప్రదర్శనతో మూడు వికెట్లు పడగొట్టింది. భారత పసిడి విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ ఏడాది జనవరిలో అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన టిటాస్ సాధు.. అప్పుడు ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించటంలో.. ఇప్పుడు ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేయటంలో తనదైన పాత్ర పోషించింది. ఊహించని రీతిలో భారత ఆసియా క్రీడల జట్టుకు ఎంపికైన సాధు.. సోమవారం నాటి పసిడి పోరులో 4-2-6-3తో చిరస్మరణీయ స్పెల్‌తో తిరుగులేని గణాంకాలు నమోదు చేసింది. సాధు నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడిన్ చేసి మూడు వికెట్లు పడగొట్టింది. సాధు దెబ్బకు కుదేలైన శ్రీలంక టాప్ ఆర్డర్.. మ్యాచ్‌లో లక్ష్యం దిశగా సాగలేదు. చామరి ఆటపట్టు (12), అనుష్క సంజీవని (1), విష్మి గుణరత్నె (0)లు సాధుకు దాసోహం అయ్యారు. హాసిని పెరీరా (25), నీలాక్షి డిసిల్వ (23), రణసింఘె (19) మిడిల్‌లో మెరిసినా.. ఫలితం దక్కలేదు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజ, దేవికలు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు, టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఆశించిన స్కోరు సాధించలేదు. ఓపెనర్ మంధాన (46), జెమీమా రొడ్రిగస్ (42) మాత్రమే మెరిశారు. మంధాన నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరువగా.. రొడ్రిగస్ ఐదు బౌండరీలతో కదం తొక్కింది. టాప్ ఆర్డర్‌లో ఈ ఇద్దరి మెరుపులతోనే భారత్ మెరుగైన స్కోరు చేయగల్గింది. షెఫాలీ వర్మ (9), రిచా ఘోష్ (9), హర్మన్ ప్రీత్ కౌర్ (2) నిరాశపరిచారు. నిషేధం అనంతరం తొలి మ్యాచ్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు ఇవ్వలేకపోయింది. శ్రీలంక బౌలర్లలో ప్రబోధిని, సుగంధిక, ఐనోకలు రెండేసి వికెట్లు పడగొట్టారు.