భయపెట్టడమే మా లక్ష్యం

భయపెట్టడమే మా లక్ష్యంశ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్‌ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 15న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు సాయికిరణ్‌ దైదా మీడియాతో మాట్లాడుతూ, ‘నల్గొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకుని, దీన్ని హర్రర్‌ జోనర్‌లో చెప్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ సినిమా మొదలుపెట్టాను. యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకోవటం జరిగింది. ప్రేక్షకులు హర్రర్‌ జోనర్‌ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హర్రర్‌ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. ఇది నా మొదటి సినిమా కాబట్టి భారీ తారాగణం ఉండదు. కథ బలంగా ఉండాలి. దానిని దష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌ని ఎంతో శ్రద్ధతో రాసుకున్నాను. ఫస్ట్‌కాపీ చూసుకున్న తర్వాత విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది. ‘పిండం’ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్‌ పాయింట్‌ అదే. టీజర్‌కి, ట్రైలర్‌కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్‌తోనే మా సినిమా బిజినెస్‌ అయిపోయింది. ట్రైలర్‌ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్‌, ట్రైలర్‌లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్‌ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా తర్వాత ‘కష్ణుడి లంక’ అనే క్రైమ్‌ కామెడీ సినిమా చేయబోతున్నాను. దీని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను’ అని తెలిపారు.