– బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
– పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్థంతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాది మాత్రమేననీ, ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి రాజాసింగ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జి.మనోహర్‌రెడ్డి, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దళితలకిచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే రాష్ట్ర ప్రజలు మార్చేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని పూడ్చడానికే కాంగ్రెస్‌కు సరిపోతుందన్నారు. ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు.