– పోతారంలో ఋతు ప్రేమ కార్యక్రమంపై అవగాహన సదస్సు
– మహిళ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
– జూన్14 నుంచి గర్భిణీలకు స్త్రీలకు కెసిఆర్ న్యూట్రీషన్ కిట్లు
– రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడి
మహిళారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ….మహిళల ఆరోగ్య సంక్షేమం కోసం ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ సేవలతో పాటు “ఋతు ప్రేమ సేవలు” అందనున్నాయని
అందుకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం
గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “ఋతు ప్రేమ” అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పి చైర్మన్ రోజా శర్మతో కలిసి పాల్గొని మాట్లాడారు.ప్రతి మూడు నెలలకోసారి ఎంసీడీ కిట్లను ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అందిస్తూ వైద్య సమాచారం తెలుసుకుంటుందన్నారు. దుబ్బాక మండల వ్యాప్తంగా మహిళలకు ఋతు ప్రేమ పై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి మంత్రి ఆదేశించారు.గ్రామాల్లో బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులందరికీ నెల నెల మెడిసిన్ ఇవ్వాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం ద్వారా ప్రజలకు అద్దాలను అందించి వారి దృష్టి లోపాన్ని తీర్చిందని పేర్కొన్నారు. నేడు కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.ఇక నేను కూడా కంటి వెలుగు అద్దాలే వాడుతున్నాని మంత్రి ఈ సమావేశంలో వెల్లడించారు. ఇక జూన్ 14 నుండి గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ న్యూట్రీషన్ కిట్లు పంపిణీ చేస్తామని, ప్రతి మంగళవారం తిమ్మాపూర్ పిహెచ్ సి లో ఆరోగ్య మహిళ, ఋతు ప్రేమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మాజీ స్వర్గీయ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి హయాంలో అక్కచెల్లెలకు మంచినీటి కోసం రోడ్లపై బిందాలతో నిరసన చేశారని… నేడు ఆమహిళల బాధని తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని అన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేస్తున్న పనితో సర్కారు దవాఖానాల్లో గిరాకీ లేక ప్రైవేటు ఆసుపత్రులు మూతపడే పరిస్థితికి తీసుకొచ్చిందన్నారు. జూన్ నెలాఖరు నుంచి గృహ లక్ష్మీ పేరుతో మూడు లక్షలు మంజూరు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. పేదవాల్లకు మంచి వైద్యం అందాలనేదే ప్రభుత్వ లక్ష్యంతో సర్కార్ దవాఖానలో వైద్యులను పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పాలత, సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి,తిమ్మాపూర్, రామక్కపేట వైద్య అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశవర్కర్లు, గ్రామ మహిళలు ఉన్నారు