పడికట్టు పదాలు మనం ఎప్పటికి మానేస్తాం!?
అవే పదాలు… అదే చెప్పడం!
పుంజీడు సూక్తుల్ని బట్టీ పట్టి వల్లె వేసి… చెప్పి చెప్పీ
విసుగు తెప్పించడమా? విరక్తీ రప్పించడమా!?.
ఇంకా ఈ పదాలు పెదాలపైన నానడమేనా…??
అసలు నిన్ను నువ్వు ప్రేమించేదెప్పుడు
నీలో నిన్ను చూసుకునేదెప్పుడూ
నిన్ను నువ్వు శోధించేదెప్పుడు నీతో నీవు రమించేదెప్పుడు…
ఒక్కసారి నీలోకి నువ్వు చూడు అప్పుడు నువ్వు సాధించేది
విజయం కాదు – ఘన విజయం!
నీ తప్పుల్ని ఎంచేది అవతలోడు కాదు నీలోని అంతరాత్మ…
ఆ – ప్రబోధాన్ని విను- ప్రభావితమవ్వు!
ప్రలోభాల ప్రతాపం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
పక్కవాడు ఏవనుకుంటాడో అని నీమదిలో నువ్వే ఖైదీగా ఎందుకు!!?
మనస్సాక్షిని మించింది లేదని…
నిన్ను నువ్వే సరిదిద్దుకుని పద ముందుకు!!.
సందేహమే సంకల్పానికి ప్రధమ శత్రువు
సాధించాలన్న తెగింపూ తలంపూ
మన ఘన విజయాలకు దారి చూపిస్తాయి!
తనువుకి తూట్లు పడ్డప్పుడే కదా
వెదురుముక్క వేణువై వేలరాగాలు పాడేది!!
అణువంతే ఆత్మవిశ్వాసం! అయితేనేం
మనసుకి ఆకాశమంత ఆనందాన్నివ్వదా.
నిన్ను నువ్వు నమ్మకుండా ఎవడినో నమ్మడంలో జీవితమే వధా ..!
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834