
– ఆర్డీవో కు చౌటపల్లి రైతుల వినతి
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
దళితుల కోసం ఆనాడు ఇందిరమ్మ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను నమ్ముకుని జీవిస్తున్నామని, ఆ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తే మా భూములు ఇవ్వబోమని మా భూములు మాకే ఉండాలని మంగళవారం చౌటపల్లి, తోటపల్లి గ్రామ రైతులు ఆర్డీవోకు విన్నవించారు. అనంతరం ఎలాగైనా మా భూములను మాకే ఉండేలా చూడాలని డి ఏ ఓ కు రైతులు ఒక్కొక్కరిగా వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి జనగామ వరకు నేషనల్ హైవే కాబోతుందని, చౌటపల్లి గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపుల ఉన్న 312 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి విలువలు పెరుగుతాయన్నారు. అలాంటి భూమిని ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అక్కన్న పేట మండల కేంద్రంలో చాలా భూములు ఉన్నాయన్నారు. పేదల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 312లో పేద దళితులమైన ఎస్సీ కుటుంబాల కు ఒక్కొక్కరికి 10,20 గుంటల భూమిని ఇచ్చిందన్నారు. అలాంటి భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుకు తీసుకోవద్దని కోరారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కు చౌటపల్లి రైతులు పార్కు కోసం భూమిని తీసుకోవద్దని వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. జనవరి 28న చౌటపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం మా తాతల కాలం నాటి భూమి, భూములపై ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేద ప్రజల భూములను మాకే ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటపల్లి ,తోటపల్లి రైతులు మాశం రాద, వైనాల శ్రీనివాస్, సుద్దాల సుమంత్, గోదార్ల నాగభూషణం, కామాద్రి లక్ష్మి, వైనాలా రాణి, సూరవ్వ, కందుకూరి కనకవ్వ, కామాద్రి రాంబాబు, గణేష్, మంచి కట్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.