‘ప్రస్తుతం ఉన్న కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడు తుంటారు. కానీ మేం మాత్రం శంకర్‌ని చూసి గర్వపడు తుంటాం. ఆయనే డైరెక్టర్లకు ‘ఓజీ’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే, డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ కాన్ఫిడెంట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు.
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొం దిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ ఈనెల 10న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ఈ మూవీతో వింటేజ్ శంకర్‌ని చూస్తాం. ‘ఒకే ఒక్కడు’ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ స్థాయిని మించేలా ఈ సినిమా ఉంటుందనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే.. ప్రతీ షాట్, సీన్ ఎగ్జైట్‌మెంట్ ఇచ్చింది’ అని అన్నారు. ‘ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. అందరూ శంకరాత్రి అని అంటున్నారు. కానీ ఇది రామ నవమి. కార్తిక్ సుబ్బరాజ్ వద్ద కథను తీసుకుని ఈ మూవీని చేశాను. ఇది కూడా నాకు ఓ గేమ్ ఛేంజర్ లాంటిదే’ అని డైరెక్టర్ శంకర్ చెప్పారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళికి థ్యాంక్స్. రాజమౌళి, శంకర్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు. అందరి పర్ఫామెన్స్‌లతోనే ఈ సినిమా ఎలివేట్ అవుతోంది’ అని అన్నారు. ‘తమిళ్ సినిమాను శంకర్ పాన్ ఇండియాగా చేశారు. రాజమౌళి తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. ఈ సినిమాని ఎవ్వరూ ఊహించ లేరు. ఇదొక గొప్ప సినిమా కానుంది’ అని దిల్ రాజు చెప్పారు.