ఆకురాలు కాలంలో
ఏ చెట్టు వైభవాన్ని చాటుకోదు
కాల మహిమ ఎరిగినట్లు
వసంతాన్ని కలగంటుంది!
దు:ఖ రహస్యం ఒక్కటే
సహజ సిద్ధమని ఎవరు విశ్వసిస్తారో
వారి కళ్లెప్పుడు చెమ్మగిల్లవు
పైగా కాంతివంతమవుతాయి!
మనిషి తొలిముచ్చట
ఏడుపుతోనే మొదలైతది
జీవితం ఎన్ని ఇంద్రధనస్సులిచ్చినా
చివరకు సాగనంపేది దు:ఖమొక్కటే!
ద్ణుఖం ఎప్పుడూ బాధ కారాదు
అదో ‘మేలు’కొలుపు గీతం
బాధ తెలియని జీవితం
ఆగిపోయిన
ప్రయాణం వంటిదే!
కొత్త దారులు వేసిన
క్రాంతదర్శుల పాదాలను చూడు
ముళ్లని రాళ్లని జయించిన
ఆ పాదాలు చిరునవ్వుల్ని చిందిస్తాయి!
అడుసు తొక్కిన పాదాలు
అపజయం చవిచూసిన చేతులు
కాలాన్ని ఎప్పుడూ నిందించవు
లో లోపలికి తొంగి చూసుకుంటాయి!
మనకు ప్రయాణం కొత్తగానప్పుడు
గమ్యం ఎప్పుడు భయపెట్టదు
ప్రతి అడుగూ ఒక పాఠం అయినప్పుడు
ఎగతాళి వెక్కిరింత
దూదిపింజలే!
ఎప్పుడైనా పొద్దుపొడుపు కల
కఠిన పరీక్షలే పెడుతుంది
పోర నిల్వబడిన వారికే
చరిత్ర ఓ పేజీ కేటాయిస్తుంది!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి
9440233261